18వ రోజు వసూళ్లు: టాప్ ప్లేస్ లో MSG.. ఆ రికార్డ్ బ్రేక్..
విడుదలైన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఆ చిత్రం కుటుంబ ప్రేక్షకులు, అభిమానులను థియేటర్లకు రప్పిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు- MSG మూవీ మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలై ఆడియన్స్ ను ఆ రేంజ్ లో మెప్పించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పండుగ సీజన్ ను పూర్తిగా క్యాష్ చేసుకుంటూ సాలిడ్ వసూళ్లతో ముందుకు సాగుతోంది.
విడుదలైన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఆ చిత్రం కుటుంబ ప్రేక్షకులు, అభిమానులను థియేటర్లకు రప్పిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే రూ.200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడమే కాకుండా టాలీవుడ్ సంక్రాంతి చిత్రాల చరిత్రలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 18వ రోజుకు చేరేసరికి సినిమా రూ.201.93 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.
చిరంజీవి కెరీర్ లో తొలిసారిగా రూ.200 కోట్ల నెట్ గ్రాస్ మార్క్ దాటిన దక్కించుకున్న చిత్రంగా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు.. సంక్రాంతి రిలీజ్ లలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడం విశేషం. అంతకుముందు ఆ రికార్డు తేజ సజ్జా నటించిన హనుమాన్ (రూ.201.91 కోట్లు) పేరిట ఉండేది. 2024 సంక్రాంతికి వచ్చిన ఆ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా హనుమాన్ వసూళ్లను అధిగమిస్తూ చిరంజీవి సినిమా టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సంక్రాంతి నెట్ గ్రాసర్ల ఆల్ టైమ్ జాబితాలో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రూ.201.93 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో హనుమాన్, మూడో స్థానంలో అలా వైకుంఠపురములో నిలిచాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆ మూవీ 2020 పొంగల్ కు వచ్చింది.
అయితే హనుమాన్ మూవీ వచ్చి రెండేళ్లు అవ్వగా.. గత ఏడాది పొంగల్ కు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ హనుమాన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. రూ.186.97 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు బ్రేక్ చేసి సత్తా చాటింది. మెగాస్టార్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది.
ఏదేమైనా సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత కూడా థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, పాజిటివ్ మౌత్ టాక్ మూవీ విజయానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని సమానంగా ఆకట్టుకోవడం సినిమాకు ప్లస్ అయింది. చిరంజీవి నటన, ఎమోషనల్ సన్నివేశాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే రెండో, మూడో వారాల్లో కలెక్షన్లు తగ్గకుండా నిలకడగా రావడం గమనార్హం. అదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది.