ఆ క్రేజీ హీరోయిన్ తో చిరూ - అనిల్ మూవీలో స్పెషల్ సాంగ్?
మన శంకరవరప్రసాద్ గారులోని స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.;
టాలీవుడ్ మూవీ ఆడియన్స్ ఎంతో ఎదురుచూస్తున్న సినిమాల్లో మన శంకరవరప్రసాద్ గారు కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న చిరంజీవి ఈసారి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కీలక పాత్రలో వెంకటేష్
అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కు, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఎలా ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారుపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసిన అనిల్
సినిమాపై ఉన్న అంచనాలను, హైప్ ను దృష్టిలో ఉంచుకుని అనిల్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని, ఆ స్పెషల్ సాంగ్ ను ఓ స్టార్ హీరోయిన్ తో చేయించాలని రావిపూడి భావిస్తున్నారని ఇప్పటికే వార్తలు రాగా ఇప్పుడా సాంగ్ పై ఓ అప్డేట్ వినిపిస్తోంది. మన శంకరవరప్రసాద్ గారులోని స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ మధ్య స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ కు తమన్నా కేరాఫ్ గా మారగా, ఆమె చేసిన స్పెషల్ డ్యాన్స్ నెంబర్లన్నీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ తో పాటూ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాయి. స్పెషల్ సాంగ్స్ విషయంలో తమన్నా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే అనిల్ ఈ సాంగ్ కోసం తమన్నాను సెలెక్ట్ చేశారని అంటున్నారు. కాగా తమన్నా ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మన శంకరవరప్రసాద్ గారు మూవీని నిర్మిస్తున్నారు.