సంక్రాంతికి చిరు సినిమాలు రెండు వస్తే?
మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడో పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. తాను నటించిన రెండు సినిమాల్లో ఎటువైపు నిలవాలో తెలియని పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడో పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. తాను నటించిన రెండు సినిమాల్లో ఎటువైపు నిలవాలో తెలియని పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటేమో.. బాబి కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య తర్వాత చేస్తున్న కాకా కాగా, ఇంకొకటి ఎప్పుడో నాలుగేళ్ల ముందు మొదలుపెట్టిన విశ్వంభర. కాకా మొదలైన దగ్గర్నుంచి మంచి హైప్ తెచ్చుకుంది. చకచకా షూటింగ్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్‌కు డేట్ కూడా ఇచ్చేశారు.
కానీ విపరీతంగా ఆలస్యమై ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చిన విశ్వంభరను కూడా వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాలని దాని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి డిజిటల్ డీల్ పూర్తయిందట. నిర్మాతలు ఆశించిన స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరు రేటు దక్కింది. ఐతే తాము చెప్పిన డేటుకు రిలీజ్ చేస్తేనే ఈ రేటు అన్నది ఓటీటీ సంస్థ పెట్టిన కండిషన్. ఆ సంస్థ సంక్రాంతికి రిలీజ్ చేయాలని షరతు పెట్టిందంటున్నారు. సినిమాకు అందుబాటులో ఉన్న బెస్ట్ రిలీజ్ డేట్ కూడా ఆ సీజనే అని టీం భావిస్తోంది.
కాకా సినిమాను వాయిదా వేయించి సంక్రాంతికి విశ్వంభరను తెద్దామన్న ప్రయత్నం ఫలించలేదు. ఆ టీం అందుకు ససేమిరా అనేసింది. ఇందులో చిరు అభిప్రాయమేంటో తెలియదు. డిసెంబరు ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలతో ప్యాక్డ్‌గా ఉండగా.. పోటీకి తోడు అప్పటికి సినిమాను రిలీజ్‌కు రెడీ చేయడం కష్టమని టీం వెనక్కి తగ్గింది. ఇక సంక్రాంతి మిస్సయితే వేసవి వరకు వేచి చూడాలి. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయింది. పైగా ఓటీటీ సంస్థ కండిషన్ ఉంది కాబట్టి సంక్రాంతి రిలీజ్ కోసం ట్రై చేశారు.
కానీ కాకాను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ ఆరంభానికి కొంచెం ముందుగా.. కాకా రావడానికి నాలుగు రోజుల గ్యాప్‌లో జనవరి 9న విశ్వంభరను రిలీజ్ చేసే అవకాశాన్ని కూడా టీం పరిశీలిస్తోందట. ఇంకే ఛాయిస్ లేని పరిస్థితుల్లో విశ్వంభరను అలా రిలీజ్ చేసేస్తే.. ఒక సంక్రాంతి సీజన్లో రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన అరుదైన హీరోగా చిరు రికార్డులకెక్కుతారేమో.