చెన్నైతో బాస్ చిరంజీవి అనుబంధం.. అస్స‌లు అలా ఊహించుకోకండి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలో ఉన్న ఆ ఛమక్కు, ఛమత్కారం మరోసారి సినిమా వేడుక‌లో ప్రేక్షకాభిమానులను క‌ట్టిప‌డేసాయి.

Update: 2026-07-23 03:54 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలో ఉన్న ఆ ఛమక్కు, ఛమత్కారం మరోసారి సినిమా వేడుక‌లో ప్రేక్షకాభిమానులను క‌ట్టిప‌డేసాయి. తాజాగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం `చెన్నై లవ్ స్టోరీ` చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి త‌న‌దైన శైలి స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో ర‌క్తి క‌ట్టించారు. ఆయ‌న‌ సరికొత్త మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌తో వేదికపై ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూ ఛ‌మ‌త్కార‌మైన, ఫ‌న్ తో కూడిన మాట‌ల‌తో నవ్వులు పూయించారు. `చెన్నై లవ్ స్టోరీ`" అనే టైటిల్ వినగానే తనకు పాత రోజులు గుర్తుకొచ్చాయని... చెన్నై నగరంపై ఉన్న ప్రేమను ఎంతో ఫన్‌గా, సరదాగా ముడిపెడుతూ మాట్లాడారు. బాస్‌లో ఉన్న ఆ టైమింగ్, సర్కాజం ఎప్పటికీ తగ్గవంటూ ఆడిటోరియంలోని అభిమానులంతా హుషారుగా కేరింతలు కొట్టారు.

యువ ట్యాలెంట్ లో ఉత్సాహం నింపుతూ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... చెన్నై నగరంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెన్నై లవ్ స్టోరీ టైటిల్ వినగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ప్రేమ గుర్తుకువచ్చాయని అన్నారు.. అయితే అది ఆ త‌ర‌హా ప్రేమ క‌థ కాదు! అంటూ ఫ‌న్ కురిపించారు. ``ఆ రోజుల్లో సినీ ఆశలతో చెన్నైలో అడుగుపెట్టినప్పుడు, అక్కడి స్టూడియోలను చూసి ఇక్కడే కదా మన ఆశలు నెరవేరాలి..నటుడిగా నిలదొక్కుకోవాలి అనిపించేది. ఆకాశమంత కలలతో అవకాశాల కోసం చెన్నై రోడ్ల మీద నడిచి తిరిగాను. ఆ తర్వాత కాలంలో అదే రోడ్లపై స్టార్ హోదాలో కార్లలో తిరిగాను. ఈ టైటిల్ వినగానే ఆ మ్యాజిక్.. ఆ జ్ఞాపకాలన్నీ కళ్లముందు మెదిలాయి`` అని తెలిపారు. యంగ్ స్టర్స్, తన అభిమానులు కలసి తీసిన సినిమా కావడంతోనే..వారిపై ఉన్న ప్రేమతో ఈ ఈవెంట్‌కు విచ్చేసానని చెప్పారు.

అభిమానుల ఎదుగుదలపై చిరంజీవి ఎంతో ఆత్మీయంగా స్పందించారు. ''నాపై చూపించే అభిమానాన్ని నేను చాలా ఇష్టపడతాను. అయితే నన్ను అభిమానించడమే కాకుండా మీరు సమాజంలో... మీ కుటుంబాల్లో ఒక ఉన్నత స్థానానికి ఎదిగి ప్రయోజకులు కావాలి. మీ తల్లిదండ్రులు.. సమాజం గర్వపడేలా చేస్తేనే అది నాకు నిజమైన సంతోషం. నాపై మీరు చూపించే అసలైన ప్రేమగా భావిస్తాను'' అని పిలుపునిచ్చారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఎస్ కేఎన్, సాయి రాజేష్‌లను ఈ వేదికపై అభినందించారు. ఎస్ కేఎన్ జర్నలిస్ట్ నుంచి ప్రొడ్యూసర్‌గా మారడం, సాయి రాజేష్ తన దర్శకత్వ ప్రతిభతో రెండు జాతీయ అవార్డులు అందుకోవడం తనకు గర్వకారణమని కొనియాడారు.

యువతకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడిన చిరంజీవి.. కంఫర్ట్ జోన్‌ను వదిలేసి కష్టానికి ఎదురెళ్లినప్పుడే విజయం సొంతమవుతుందని చెప్పారు. సాధారణ నేపథ్యం ఉన్నవారైనా అసాధారణ కలలు కనాలి. ఆ కలలను నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలి. అందుకూ నేనే ఒక ఉదాహరణ. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలి అని మార్గదర్శనం చేశారు. అలాగే హీరో కిరణ్ అబ్బవరంపై ప్రశంసల జల్లు కురిపించారు. కిరణ్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడని.. ఒకప్పుడు థియేటర్లలో తన సినిమాలు చూసిన అతడు.. ఇప్పుడు స్వయంకృషితో హీరోగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రీకి కిరణ్ లాంటి కొత్త టాలెంట్ రావడం ఎంతో అవసరమని... అప్పుడే పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న తెలుగుమ్మాయి గౌరి ప్రియను కుందనపు బొమ్మగా వర్ణిస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తనకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు, తన సోదరుడు మణిశర్మ గురించి ప్రస్తావిస్తూ ఆయన్ను అభినందించారు. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మద్దతుగా నిలుస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిలకు తన ధన్యవాదాలు తెలపడమే కాకుండా.. చెన్నై లవ్ స్టోరీ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.













Tags:    

Similar News