నలుగురు భామల మధ్యలో ఇద్దరు సీనియర్లు!
ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోలు మాస్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి - నటసింహం బాలకృష్ణ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే;
ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోలు మాస్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి - నటసింహం బాలకృష్ణ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి-బాబి కాంబినేషన్‌లో ఓ సినిమా, బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా శరవేగంగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ కథానాయకులు ద్విపాత్రాభినయం పోషిస్తుండటంతో కథ పరంగా ఇద్దరేసి హీరోయిన్ల అవసరం ఏర్పడింది.
అంటే ఈ రెండు భారీ ప్రాజెక్టులకు కలిపి మొత్తం నలుగురు భామలు కావాలి. చిరంజీవి -బాబి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో చిరు రెండు భిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం ఇప్పటికే సీనియర్ నటి ప్రియమణిని ఎంపిక చేసినట్లు సమాచారం. చిరంజీవి వయస్సు , అనుభవానికి తగ్గట్టుగా ప్రియమణి సరైన ఎంపిక అని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రెండో పాత్రకు జోడీగా నటించే నటి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ పాత్రకు గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న నటి కావాలని బాబి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
కొంత మంది భామలని పరిశీలించారు. కానీ తాను కోరుకున్న విధంగా ఏ నటి లేకపోవడంతో ఇంకా అన్వేషణ సాగిస్తున్నాడు.
ఆ భామల్లో ఏదో ఒకటి మిస్ మ్యాచ్ అవ్వడంతో ఈ సమస్య తలెత్తింది. మరోవైపు బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `వీరసింహారెడ్డి` బ్లాక్ బస్టర్ అవ్వడంతో? ఈసారి అంతకు మించిన యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండటంతో ఒక పాత్రకు జోడీగా కాజల్ అగర్వాల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన అనుభవం ఉండటంతో కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. కానీ రెండో పాత్రకు తగిన హీరోయిన్ సెట్ అవ్వాల్సి ఉంది.
దీంతో ఇద్దరు సీనియర్ హీరోల పక్కన నటించే హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకులకు సవాలుగా మారింది. పాత్రల స్వభావానికి తగ్గట్టుగా ఉండటమే కాకుండా హీరోల ఇమేజ్‌కు సరిపోయేలా ఉండాలి. యంగ్ హీరోయిన్లను ఎంచుకుంటే అది స్క్రీన్ మీద ఎబ్బెట్టుగా ఉంటుంది. చిరు, బాలయ్య, వెంకటేష్ లతో పొలిస్తే అందుకు అర్హుడు కవేలం నాగార్జున మాత్రమే. ఆయన సరసనే యువ నాయికలు సెట్ అవుతారు. దీంతో బాలయ్య, చిరుల కోసం పరిణతి చెందిన అందం , నటన కనబరిచే భామల కోసం బాబి - గోపీచంద్ మలినేని కలిసి వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరికి తారసపడినా ? ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.