సినీరంగం నుంచి వందల కోట్ల రెవెన్యూని లైట్ తీస్కున్న చంద్రబాబు?
తాజాగా గద్దర్ అవార్డ్స్ 2025-26 వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఈ అంశాన్ని సునిశితంగా ప్రస్థావించారు. ఆయన తనదైన శైలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సున్నితంగా ఈ విషయాన్ని తెలియజేసారు.;
కొన్ని నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి..! సినీపరిశ్రమ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరానికి తరలి వెళుతుందని నేరుగా ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించి, నవతెలంగాణ ఏర్పాటులో భాగం అయిన కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) అప్పట్లోనే ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఏపీకి తెలుగు సినీపరిశ్రమ తరలి వెళ్లలేదు. దీనికి కారణం ఏపీలో ఉన్న అస్థిర ప్రభుత్వాలు అనేది సుస్పష్ఠం. ప్రభుత్వాలు మారడంతో రాజధాని నిర్మాణం కుంటుపడింది. దాంతో పాటే పరిశ్రమల అభివృద్ధి దివాళా తీసింది. ముఖ్యంగా వినోదపరిశ్రమ ఏపీలో ప్రారంభమవ్వడానికి ఆస్కారమే లేకుండా పోయిందనేది నిర్వివాదాంశం.
అయితే తెలుగు సినీపరిశ్రమను ఏల్తున్న చాలా మంది సినీప్రముఖులు పరిశ్రమ తరలివెళుతుందని బహిరంగ ప్రకటనలు చేసినా కానీ తెలంగాణ ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాయి. ఇప్పటి రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దే సంకల్పంతో తెలుగు సినీ ప్రముఖుల ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు. ఇది సినీపరిశ్రమ తరలింపును పూర్తిగా జీరోను చేస్తోంది. దీంతో సినిమా టీవీ రంగాల నుంచి ప్రతియేటా పన్నుల రూపంలో జనరేట్ అయ్యే వందల కోట్ల రెవెన్యూ ఏపీకి లేకుండా పోయింది. పరిశ్రమ హైదరాబాద్ లో ఉన్నంత కాలం ఈ రెవెన్యూని కేవలం తెలంగాణ ఖాతాకు మాత్రమే జమ అవుతుంది. తద్వారా వందల కోట్ల నష్టాన్ని ఏపీ చవి చూస్తుంది.
తాజాగా గద్దర్ అవార్డ్స్ 2025-26 వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఈ అంశాన్ని సునిశితంగా ప్రస్థావించారు. ఆయన తనదైన శైలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సున్నితంగా ఈ విషయాన్ని తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం ప్రస్తుత పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తన ప్రసంగంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తావిస్తూ.. అక్కడ కళాకారులను గౌరవించే విషయంలో.. సినిమా రంగాన్ని ఉత్సాహపరిచే విధానంలో కొంత `వెనకంజ` వేసిందని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్లకు అత్యంత ఆప్తులు.. సినిమా రంగంపై అవగాహన ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను.. ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడుకి చిరంజీవి విన్నవించారు. ఏపీ ప్రభుత్వం కూడా సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే.. ఎంతో మంది యంగ్ స్టర్స్ ముందుకు వచ్చి మరిన్ని మంచి సినిమాలు చేస్తారని.. తద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో తోడ్పడుతుందని ఆయన సూచించారు. చాలా సూటిగా సుత్తి లేకుండా.. సినిమా రంగం అభివృద్ధికి, కళాకారుల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ఆయన వినమ్రంగా కోరారు. దీనిని బట్టి వినోదపరిశ్రమను తరలించడాన్ని తద్వారా వచ్చే ఆదాయాన్ని ఏపీ ఎలా లైట్ తీస్కుందో స్పష్ఠంగా అర్థం చేసుకోవచ్చు..
రెడ్ స్టార్ పంచ్ లు..
ఇక ఇదే వేదికపై హైదరాబాద్ సినీపరిశ్రమ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు వెనకబడిపోయారని ఆర్.నారాయణమూర్తి విసిరిన పంచ్ అందరికీ చేరుకుంది. నంది అవార్డులను ఇవ్వాలని సీఎం చంద్రబాబును అభ్యర్థిస్తూ నారాయణ మూర్తి.. చంద్రబాబు గారూ దణ్ణం సార్! అని వ్యాఖ్యానించారు. నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఒక ప్రత్యేక విన్నపం చేశారు. వేదికపైనే రెండు చేతులు జోడించి దండం పెడుతూ.. నంది అవార్డులు ఇవ్వరా సార్? అని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సినీపరిశ్రమను అభివృద్ధి చేస్తూ దూసుకెళ్లిపోతున్నారని.. అదే విధంగా ఏపీలో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమను గుర్తించి నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. పరిశ్రమను ఆదుకోవాలని నారాయణమూర్తి ఎంతో ప్రాధేయపడ్డారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాలి.