చిన్మ‌యి నిర్మాతల‌ కోసం అవ‌కాశాలే వ‌దుల‌కుంటుందా?

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణమైన గొంతుతో ఎంతోమంది స్టార్ హీరోయిన్లకు ప్రాణం పోశారు.

Update: 2026-05-18 01:30 GMT

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణమైన గొంతుతో ఎంతోమంది స్టార్ హీరోయిన్లకు ప్రాణం పోశారు. ముఖ్యంగా సీనియర్ నటి త్రిష కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `96` వంటి చిత్రాలకు చిన్మయి చెప్పిన డబ్బింగ్ మ్యాజిక్ క్రియేట్ చేసింది. అయితే ఇండస్ట్రీలో తనపై ఉన్న కొన్ని నిషేధాలు వివాదాల కారణంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను చిన్మయి తాజాగా మరోసారి బయటపెట్టారు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `కరుప్పు` లో తానే డబ్బింగ్ చెప్పినా? ఆ విషయాన్ని అధికారికంగా అంగీకరించడానికి ఒకానొక దశలో తీవ్రంగా భయపడ్డానని చిన్మ‌యి చేసిన వ్యాఖ్యలు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ భయానికి గల కారణాలను చిన్మయి సోషల్ మీడియా వేదికగా వివరించారు. గతంలో దళపతి విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం `లియో` విడుదలైన సమయంలో త్రిష పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలో తమిళనాడులోని డబ్బింగ్ యూనియన్ నుండి చట్టపరమైన ఇబ్బందులను, ఒత్తిడిని ఎదుర్కొన్నారు. `లియో` సినిమా రిలీజ్ టైమ్‌లో జరిగిన ఆ చేదు అనుభవాలు ,వివాదాల వల్లే మళ్లీ `కరుప్పు` చిత్రానికి డబ్బింగ్ చెప్పినట్లు ముందే లీక్ అయితే సినిమా విడుదలకు ఆటంకం కలుగుతుందోననే? భయం తనను వెంటాడిందని చిన్మయి తెలిపారు.

సౌత్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టులపై ముఖ్యంగా తనపై ఉన్న కొన్ని అలిఖిత నిబంధనలు నిషేధాల వల్ల నిర్మాతలు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే `కరుప్పు` సినిమా ప్రమోషన్స్ సమయంలో కానీ,ట్రైలర్ విడుదలైనప్పుడు కానీ తానే వాయిస్ ఇచ్చాననే విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచాల్సి వచ్చిందన్నారు. తన వల్ల ఏ సినిమా ప్రొడక్షన్ హౌస్‌ కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. ఇలాంటి కార‌ణాల‌తో చాలా సినిమాలు వ‌దుల‌కోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇలాంటి స‌మ‌యంలో తనకు మద్దతుగా నిలిచిన కొందరు సినీ ప్రముఖులకు చిన్మయి కృతజ్ఞతలు తెలిపారు.

నటుడు, దర్శకుడు ఆర్‌జే బాలాజీ , హీరో సూర్యల‌ గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరిశ్రమలో చాలామంది తనతో కలిసి పని చేయడానికి వెనుకాడుతున్న సమయంలో ఆర్‌జే బాలాజీ, సూర్య వంటి వారు తనకు అండగా నిలిచారన్నారు. తన ప్రతిభను నమ్మి అవకాశాలు ఇచ్చారని కొనియాడారు. వారిచ్చిన ధైర్యంతోనే తాను ఇండస్ట్రీలో ఒత్తిడిని తట్టుకుని నిలబడగలుగుతున్నాన‌న్నారు. చిన్మయి ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న వివక్షపై నెటిజన్లు, ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆర్టిస్ట్‌ను వ్యక్తిగత లేదా యూనియన్ వివాదాల కారణాలతో ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

త్రిష సినిమాలకు చిన్మయి వాయిస్ ఒక సిగ్నేచర్‌లా మారిపోయిందని `కరుప్పు` చిత్రంలో కూడా ఆమె డబ్బింగ్ సినిమా స్థాయిని పెంచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఎంతటి స్టార్డమ్ ,ప్రతిభ ఉన్నా? కొన్నిసార్లు వ్యవస్థీకృత ఒత్తిళ్లకు లొంగిపోవాల్సి వస్తుందని చిన్మయి తాజా వ్యాఖ్యల తో స్పష్టమవుతోంది. `లియో` నుండి `కరుప్పు` వరకు ఆమె సాగించిన డబ్బింగ్ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. రాబోయే రోజుల్లోనైనా డబ్బింగ్ యూనియన్ వివాదాలు సర్దుమణిగి, చిన్మయి వంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం ఇండస్ట్రీలో ఏర్పడుతుందని విశ్లేషకులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News