6 ఏళ్లయినా తగ్గని ద్రౌపది వివాదం.. చిన్మయికి డైరెక్టర్ షాక్
ముఖ్యంగా ఫెమినిజం మీద పోరాటం చేసే సింగర్ చిన్మయికి, నెటిజన్స్ కి మధ్య సోషల్ మీడియాలో గొడవలు ఒక రేంజ్ లో జరుగుతూ ఉంటాయి.;
టాలీవుడ్ , కోలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రముఖ సింగర్ చిన్మయి గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.. ఎంతోమంది హీరోయిన్స్ కి తన గాత్రాన్ని దానం చేసి ఆ వాయిస్ తోనే మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.అలా ఒకవైపు సింగర్ గా.. మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు దక్కించుకున్న ఈమె.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫెమినిజం మీద పోరాటం చేసే సింగర్ చిన్మయికి, నెటిజన్స్ కి మధ్య సోషల్ మీడియాలో గొడవలు ఒక రేంజ్ లో జరుగుతూ ఉంటాయి.
ముఖ్యంగా ఆడవాళ్లను, పిల్లలను దూషించి హింసించే వారిపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇటీవల డీప్ ఫేక్ వీడియోలపై స్పందించిన ఈమె అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. తమ ఫోటోలను ఎవరైనా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఎలా డిలీట్ చేసుకోవచ్చో కూడా చెప్పి అందరికీ ఊరట కలిగించింది. అలాగే శివాజీ మహిళలపై వస్త్రధారణ గురించి చేసిన కామెంట్లకు కూడా స్పందించి వైరల్ అయింది చిన్మయి.
అయితే అలాంటి ఈమెకు తాజాగా ద్రౌపది డైరెక్టర్ మోహన్ జీ భారీ షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆరు సంవత్సరాలైనా ఇంకా ఈ వివాదం తగ్గలేదా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత ఆరు సంవత్సరాల క్రితం.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మోహన్ జీ తమిళంలో ద్రౌపది అనే సినిమా తీశారు. అప్పట్లో ఇది చాలా వివాదాస్పదంగా నిలిచింది. అటు కమర్షియల్ గా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. పైగా మహిళా సంఘాలు , పలువురు కార్యకర్తలు కూడా ఈ సినిమాపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కంటెంట్ మీద విరుచుకుపడ్డారు. అయితే అలాంటి వాళ్లలో చిన్మయి కూడా ఉన్నారు.
ముఖ్యంగా మోహన్ జీ ఆడవాళ్ళను కించపరుస్తున్నారని.. కులాల మధ్య గొడవ పెట్టేలా కథలు రాస్తున్నారని కూడా ఆమె విమర్శించారు. దాంతో మోహన్ జి మాట్లాడుతూ చిన్మయి కేవలం ఒక వర్గానికి పక్షపాతిగా మాత్రమే మాట్లాడుతోంది. కానీ నేను నిజాన్నే చూపించానని చెప్పారు. అలా ఆ సమయంలో వాదోపవాదనలు పెద్దగానే జరిగాయి ఇక తర్వాత కాలక్రమేనా ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఆ ద్రౌపది సినిమాకు సీక్వెల్ గా ద్రౌపది 2 కూడా వస్తోంది. అయితే ఇది ఈసారి పాన్ ఇండియా భాషల్లో వస్తూ ఉండడం గమనార్హం.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో చిన్మయితో "ఏమోకే " అనే పాట పాడించారు ఈ చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్. ప్రస్తుతం ఈ ఆడియో అటు యూట్యూబ్లో కూడా ఉంది. అయితే ఇప్పుడు చిన్మయి స్థానంలో వేరే సింగర్ తో ఆ పాటను పాడించి థియేటర్లలో ప్రదర్శిస్తామని మోహన్ జీ చెప్పుకొచ్చారు. నిజానికీ గత 18 సంవత్సరాలుగా జిబ్రాన్ తో చిన్మయికి మంచి స్నేహం ఉంది. ఇక ఆ కారణంగానే ఆయన ఒక పాట పాడాలని పిలవడంతో ఆ సినిమా ఏమిటి? ఆ సినిమా ఎవరు తీస్తున్నారు ? అనే విషయాలు ఏమీ తెలుసుకోకుండా స్టూడియోకి వెళ్లి పాట పాడేసింది. ఆ తర్వాత అది ద్రౌపది 2 కోసం అనే విషయం తెలిసింది.
ఈ నేపథ్యంలోనే అసలు విషయం తెలుసుకున్న చిన్మయి జిబ్రాన్ తో స్నేహం కారణంగానే స్టూడియోకి వెళ్లి పాట పాడాను. ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఐడియాలజీలో ఇన్ని విభేదాలు ఉన్నవాళ్లతో నేను పని చేసేదాన్ని కాదు అని చిన్మయి చెప్పుకొచ్చింది. దీంతో మోహన్ జీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె తన సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తోంది అంటూ అందుకే తన సినిమాలో ఆమె పాడిన పాటను తీసివేసి వేరొకరితో పాడించబోతున్నాను అని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.