50కోట్లు, 10 లక్షల భరణం.. భర్తపై నటి కేసు
మంచు విష్ణు సరసన `సూర్యం` అనే చిత్రంలో నటించింది సెలీనా జైట్లీ. గాజు కళ్లతో మాయ చేసిన ఈ బాలీవుడ్ భామ ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితైంది.;
మంచు విష్ణు సరసన `సూర్యం` అనే చిత్రంలో నటించింది సెలీనా జైట్లీ. గాజు కళ్లతో మాయ చేసిన ఈ బాలీవుడ్ భామ ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితైంది. సెలీనా జైట్లీ మంగళవారం ముంబై కోర్టులో తన భర్త, ఆస్ట్రియన్ బిజినెస్‌మేన్ పీటర్ హాగ్ పై గృహ హింస కేసు దాఖలు చేశారు.
తన భర్త నుండి రూ. 50 కోట్లు పరిహారంతో పాటు నెలవారీగా 10లక్షల భరణం చెల్లించాలని దావాలో పేర్కొంది. ఆమె 2010లో తన ముంబై ఇంట్లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఆయనను వివాహం చేసుకుంది. అదే ఏడాదిలో ఆస్ట్రియాలో తమ వివాహాన్ని అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే 15 ఏళ్ల దాంపత్యం సజావుగా సాగినా ఇప్పుడు ఇరువురి నడుమా గొడవలు ముదిరాయి. దీంతో సెలీనా కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలను కలవనీకుండా నిరోధిస్తున్నాడని కూడా భర్తపై సెలీనా ఆరోపిస్తున్నారు. పీటర్ హాగ్ తో ఆస్ట్రియాలో నివసిస్తున్న తమ ముగ్గురు పిల్లలు విన్‌స్టన్, విరాజ్ , ఆర్థర్ లతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు కోర్టు అనుమతి కూడా కోరారు.
తన భర్త శారీరకంగా లైంగికంగా వేధించాడని, ఆస్తులను తన పేరిట రాయించుకున్నాడని, ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డాడని, బౌతికంగా హింసించాడని పిటిషన్ లో సెలీనా ఆరోపించింది. పీటర్ బాగా తాగి ముక్కోపంతో తంతాడు. అతడి ప్రవర్తనతో తీవ్ర మానసిక, శారీరక బాధకు గురి చేస్తోంది. తన భద్రత కోసం రాత్రిపూట ఆస్ట్రియా ఇంటి నుండి పారిపోవలసి వచ్చిందని, పిల్లలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆమె పిటిషన్ లో పేర్కొంది.
దుబాయ్, సింగపూర్‌లోని ప్రముఖ హోటల్ చైన్ లతో పనిచేస్తున్న పీటర్ హాగ్ ఆగస్టులో సెలీనా నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసాడు. 15ఏళ్ల దాంపత్యంలో వివాదాల కారణంగా విడాకుల ప్రక్రియ కోరుతున్నాడు. అయితే అతడికి సైకో తరహా సమస్యలు ఉన్నాయని కూడా సెలీనా న్యాయవాది పేర్కొన్నారు. పెళ్లి తర్వాత తనను నటనలో కొనసాగకుండా ఆపేసాడని కూడా సెలీనా ఆరోపించారు.
అలాగే ముంబైలో ఉన్న ఇంటిని తన పేరుకు బదిలీ చేయాలని ఒత్తిడి చేసాడని, ముంబై, వియన్నాలో ఆస్తులపై తన నియంత్రణ లేకుండా చేసాడని కూడా సెలీనా నివేదించారు. రూ.1.26 కోట్లు, రూ.2.56 కోట్ల ఆస్తి నష్టం, రూ.32 లక్షల దుర్వినియోగ నిధులను తిరిగి అతడి నుంచి పొందాలని సెలీనా కోర్టును కోరుతోంది. నవంబర్ 15న తన భర్త తనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించి, తన పిల్లలను తనతో కలవకుండా పూర్తిగా నిరోధించాడని సెలీనా జైట్లీ పేర్కొన్నారు.
తన సోదరుడు మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ కుమార్ జైట్లీని యుఎఇలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆరోపిస్తూ భారత అధికారుల నుండి చట్టపరమైన సాయంతో పాటు, వైద్య సహాయం కోరుతూ సెలీనా జైట్లీ ఢిల్లీ హైకోర్టులో పోరాటం సాగించినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.