స్టార్ హీరో బట్టతల సమస్య.. ఇండియాలో అనుమతి లేని రోజుల్లోనే!
గ్లామర్ ప్రపంచంలో నిరంతరం వెలుగులో ఉండే నటీనటులకు శారీరక రూపం, ముఖ్యంగా జుట్టు సంరక్షణ అనేది చాలా కీలకమైన అంశం.
గ్లామర్ ప్రపంచంలో నిరంతరం వెలుగులో ఉండే నటీనటులకు శారీరక రూపం, ముఖ్యంగా జుట్టు సంరక్షణ అనేది చాలా కీలకమైన అంశం. వయసు పైబడటం లేదా ఇతర కారణాల వల్ల ఎదురయ్యే బాల్డ్ హెడ్ (బట్టతల) సమస్య సినీ తారల కెరీర్‌ను సైతం ప్రభావితం చేస్తుంటుంది. ఈ క్రమంలో తమ రూపాన్ని కాపాడుకోవడానికి వారు ఎలాంటి సవాళ్లను, వినూత్న చికిత్సలను ఆశ్రయిస్తారనే దానిపై నిరంతరం ఆసక్తికర చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల దురంధర్ చిత్రంలో అక్షయ్ ఖన్నా స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కనిపించారు. తన బట్ట తల కారణంగా చాలా అవకాశాల్ని కోల్పోయానని ఆ సినిమా ఇంటర్వ్యూలలో బహిరంగంగా చెప్పుకొచ్చారు ఆయన. ఈ బాపతు బట్టతలకు పరిష్కారం వెతికిన స్టార్ హీరోలు డజన్ల కొద్దీ ఇండస్ట్రీల్లో ఉన్నారు. తాజాగా ఒక పాపులర్ ఫిలింమేకర్ లీకుల ప్రకారం... ఇండస్ట్రీ ప్రముఖులు అనుసరించే హెయిర్ రిస్టోరేషన్ చికిత్సల వెనుక ఉన్న నిజాలు బయటకు తెలిసొచ్చాయి.
భారత్‌లో ఇంకా చట్టబద్ధమైన అనుమతులు లేని రోజుల్లోనే ఒక ప్రముఖ నటుడు తన బట్టతల సమస్య నివారణ కోసం ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (పీఆర్ పి) చికిత్సను తీసుకున్నారని సదరు పాపులర్ ఫిలింమేకర్ ఒక పోడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం సదరు నటుడి నివాసంలో ఒక మీటింగ్ కోసం వెళ్లినప్పుడు ఈ విచిత్రమైన ఉదంతాన్ని స్వయంగా తన కళ్లతో చూసినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక వ్యక్తి వచ్చి గ్లౌజ్ ధరించి, ఇంజెక్షన్ ద్వారా నటుడి తలపై ఆ చికిత్స చేస్తుండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని ఫిలింమేకర్ తెలిపారు.
ఆ సమయంతో సదరు అగ్ర నటుడు స్పందిస్తూ .. స్టార్‌గా కొనసాగాలంటే దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాలి సోదరా! అంటూ సరదాగా వ్యాఖ్యానించారని ఫిలింమేకర్ తెలిపారు. అప్పట్లో ఈ పద్ధతికి భారతదేశంలో అధికారిక అనుమతి లేకపోయినా... స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి సినీ ప్రముఖులు ఎంతటి సాహసానికైనా వెనుకాడరనే విషయాన్ని ఈ సంఘటన నిరూపిస్తోంది. పైగా కేవలం ఒక్క నటుడే కాకుండా నాటి హిందీ చిత్రపరిశ్రమలో దాదాపు 50 శాతానికి పైగా నటీనటులు ఈ తరహా పిఆర్‌పి ట్రీట్‌మెంట్ కోసం పాపులర్ క్లినిక్‌లను ఆశ్రయించేవారని ఆయన పేర్కొన్నారు.
అసలు ఏమిటి ఈ పిఆర్‌పి చికిత్స? అంటే వైద్య నిపుణుల ప్రకారం.. ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా చికిత్స అనేది మనిషి తన సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే ఒక పునరుత్పత్తి ప్రక్రియ. ఈ విధానంలో వ్యక్తి శరీరం నుండి కొంత రక్తాన్ని సేకరించి.. దాన్ని కేంద్రీకృత ప్లేట్‌లెట్లుగా ల్యాబ్‌లో శుద్ధి చేస్తారు. అనంతరం ఆ ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మాను బట్టతల ఉన్న లేదా జుట్టు రాలే భాగాల్లో తలపై సూదుల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఇందులోని గ్రోత్ ఫ్యాక్టర్లు జుట్టు కుదుళ్లను ప్రేరేపించి.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయని చెబుతారు.
చిత్రపరిశ్రమలో నిరంతరం యంగ్‌గా, అందంగా కనిపించాల్సిన ఒత్తిడి నటీనటులపై ఏ స్థాయిలో ఉంటుందో ఈ అగ్ర నటుడి ఉదంతం స్పష్టం చేస్తోంది. నేడు పిఆర్‌పి చికిత్స సర్వసాధారణంగా అందుబాటులోకి వచ్చినా అది ప్రాథమిక దశలో ఉన్న రోజుల్లోనే నటీనటులు దానిని ఆశ్రయించారంటే ఆ గ్లామర్ ఫీల్డ్‌లో రూపాన్ని కాపాడుకోవడానికి ఎంతటి రిస్క్ తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హోదాను నిలబెట్టుకోవడం వెనుక కంటికి కనిపించని ఎన్నో ప్రయాసలు.. ఖరీదైన చికిత్సలు ఉంటాయనడానికి ఈ విశ్లేషణ ఒక నిదర్శనం.