పావలా ఆదాయం.. కొట్టుకోవడం తప్ప ఎం లాభం లేదు!
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల మనుగడ, వసూళ్ల లెక్కలపై పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిర్మాతల లాభనష్టాల గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం కలెక్షన్ల పంపకాల గురించి కొట్టుకోవడం కంటే, అసలు సినిమా ఆదాయం ఎందుకు తగ్గిపోతుందో తెలుసుకోవడం ముఖ్యమని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
అసలు విషయం ఏంటంటే, ప్రస్తుతం సినిమాలకు వస్తున్న వందల కోట్ల వసూళ్లు కేవలం పెరిగిన టికెట్ రేట్ల వల్ల వచ్చినవే తప్ప, ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల కాదని బన్నీ వాసు తెలిపారు. ఒకప్పుడు రూపాయి ఉన్న ఆదాయం ఇప్పుడు పెద్ద సినిమాలకు అర్ధరూపాయికి, చిన్న సినిమాలకు పావలాకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీద అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, వాటిని భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం తెలివితక్కువతనం అని ఆయన పేర్కొన్నారు.
ఉన్న కొద్దిపాటి ఆదాయంలో ఎవరికి ఎంత వాటా రావాలని వాదించుకోవడం కంటే, అసలు ఆదాయం ఎందుకు తగ్గిందో గుర్తించాలని సూచించారు. ఈ పరిస్థితికి గల ప్రధాన కారణాలను బన్నీ వాసు చాలా స్పష్టంగా వివరించారు. హీరోలు ఒక్కో సినిమా పూర్తి చేయడానికి రెండేళ్ల సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకుల్లో సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో హీరోల పాత్ర చాలా కీలకమని, వారు త్వరత్వరగా సినిమాలు చేయకపోతే ఆ ప్రభావం మొత్తం పరిశ్రమపై పడుతుందని చెప్పారు.
అలాగే సినిమాలు విడుదలైన 27 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి ఒక ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. వీటితో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో కంటెంట్ లేకపోవడం, మల్టీప్లెక్సుల్లో క్యాంటీన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు థియేటర్ల మనుగడను దెబ్బతీస్తున్నాయని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
కంటెంట్ విషయం పక్కన పెడితే, మిగిలిన మూడు కారణాలు అంటే హీరోల కాల్షీట్లు, ఓటీటీ గ్యాప్, క్యాంటీన్ ధరలు అనేవి మన చేతిలోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ మూల సమస్యలను సరిచేయకుండా కేవలం పర్సంటేజీల కోసం పోరాటం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని, ఆ పావలా ఆదాయం కోసం కొట్టుకోవడం వల్ల ఎవరూ బాగుపడలేరని ఆయన స్పష్టం చేశారు.
ఇక బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని లోపాలను వేలెత్తి చూపిస్తున్నాయి. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారనేది వాస్తవమే అయినా, దానికి పరిష్కారం కేవలం వాటాల పంపకంలో లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. వ్యవస్థను కాపాడుకోవాలంటే మూల సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే భవిష్యత్తులో ఇండస్ట్రీ మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ వాస్తవాలను గుర్తించి ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.