రేట్లు ఎక్కువైతే పైరసీ చేస్తారా.. బన్నీ వాసు ఆవేదన..
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొన్న బన్నీ వాసు, పైరసీని సమర్థించే వారి తీరును తప్పుబడుతూ ఎమోషనల్ అయ్యారు.;
ఇటీవల పైరసీ వెబ్‌సైట్ అడ్మిన్ 'ఐబొమ్మ రవి' అరెస్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఇక్కడే ఒక విచిత్రమైన ధోరణి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. "సినిమా టికెట్ రేట్లు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి.. అందుకే మేము పైరసీలో చూస్తున్నాం, మాకు పైరసీ చేసేవాడే హీరో" అంటూ కొందరు ఆ అరెస్ట్‌ను తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొన్న బన్నీ వాసు, పైరసీని సమర్థించే వారి తీరును తప్పుబడుతూ ఎమోషనల్ అయ్యారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బన్నీ వాసు సమాధానమిస్తూ.. "రేట్లు పెంచేశారు అందుకే పైరసీ చూస్తున్నాం అనేది ఒక సాకు మాత్రమే. సంవత్సరానికి 100 సినిమాలు వస్తే, అందులో టికెట్ రేట్లు పెంచేది కేవలం 10 లేదా 15 పెద్ద సినిమాలకు మాత్రమే. మరి మిగిలిన 85 చిన్న సినిమాలను ఎందుకు పైరసీలో చూస్తున్నారు? అని ప్రశ్నించారు.
కొన్ని సినిమాలకు రేట్లు తక్కువే కదా? కేవలం పెద్ద సినిమాలనే పైరసీ చేస్తున్నారా? లేదు కదా.. కష్టపడి తీసిన చిన్న సినిమాలను కూడా పైరసీ చేసి చంపేస్తున్నారు" అని లాజికల్ పాయింట్ లాగారు. నిర్మాతల కష్టాల గురించి బన్నీ వాసు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
"బయట అందరూ నిర్మాతలు అంటే కోట్లు ఉన్నవాళ్ళు, వాళ్లకు పైరసీ వల్ల నష్టమేం రాదు అనుకుంటారు. కానీ, ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలను అడిగితే తెలుస్తుంది.. వాళ్లు ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో. ప్రొడ్యూసర్స్ చొక్కా విప్పితే వెనుక వాతలు కనిపిస్తాయి. కేవలం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి బయటపడలేక నవ్వుతూ బతుకుతున్నారు. వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం కరెక్ట్ కాదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
పైరసీ చేసేవాళ్లను రాబిన్ హుడ్‌లా చూడటం మానేయాలని బన్నీ వాసు హితవు పలికారు. "రేట్లు ఎక్కువ ఉన్నాయని దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. అది క్రైమ్. దాన్ని సోషల్ మీడియాలో గ్లోరిఫై చేయడం, సమర్థించడం ఇంకా ప్రమాదకరం. దీనివల్ల మంచి సినిమాలు, చిన్న సినిమాలు బతకలేకపోతున్నాయి. ఇప్పటికైనా ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రండి" అని బన్నీ వాసు కోరారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.