బుచ్చిబాబు అందుకే రౌడీ డైరెక్ట‌ర్ అయ్యాడా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పెద్ది సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల మధ్య అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి.

Update: 2026-06-05 15:30 GMT

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పెద్ది సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల మధ్య అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్ సమయంలో జాన్వీ పలుమార్లు బుచ్చిబాబును సరదాగా రౌడీ డైరెక్టర్ అని పిలిచిన విషయం తెలిసిందే. ఒక సీన్ బాగా చేసినా చాలా బాగా చేశావమ్మా అని ప్రశంసిస్తూ, వెంటనే మరో టేక్ చేద్దామా? అని అడుగుతారని, అదే తనకు ఆశ్చర్యంగా అనిపించేదని అందుకే త‌న‌ను రౌడీ డైరెక్ట‌ర్ అని పిలుస్తున్నట్టు కూడా జాన్వీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పెద్ది సినిమా రిలీజైన తర్వాత జాన్వీ అలా పిల‌వ‌డానికి మ‌రో కార‌ణం కూడా క‌నిపిస్తుంద‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సినిమాలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రను పరిశీలిస్తే, అది ప్రస్తుతం ప్రేక్షకులు అలవాటు పడిన గ్లామరస్ లేదా అర్బన్ హీరోయిన్ పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో పెరిగినా, తనకు నచ్చింది నేరుగా చెప్తూ, కొంచెం మొండితనం, కొంచెం అల్లరి, తిరుగుబాటు స్వభావం కలిగిన అమ్మాయిగా బుచ్చిబాబు ఆ పాత్రను డిజైన్ చేశారు. ముఖ్యంగా రెండు మూడు దశాబ్దాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కొన్ని గిరిజన ప్రాంతాల్లో కనిపించే యువతుల బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, వ్యవహార శైలిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు బుచ్చి. అయితే నేటి ప్రేక్షకుల్లో చాలామందికి అచ్చియ‌మ్మ లాంటి పాత్ర పెద్ద‌గా క‌నెక్ట్ అవ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ క్యారెక్ట‌ర్ మైండ్ లోకి ఎక్క‌దు కానీ బుచ్చిబాబు మాత్రం 20 ఏళ్ల నాటి కాలం, అక్క‌డి ప‌రిస్థితుల్ని బ‌ట్టే హీరోయిన్ పాత్ర‌ను డిజైన్ చేశాడ‌ని అనిపిస్తుంది.

ఇదే నేపథ్యంలో జాన్వీ చెప్పిన రౌడీ డైరెక్టర్ కామెంట్ మరోసారి వైరల్ అవుతోంది. కేవలం టేక్‌ల విషయంలోనే కాదు, పాత్రను కూడా చాలా రఫ్ అండ్ రియలిస్టిక్‌గా మలచడంలో బుచ్చిబాబు చూపించిన పట్టుదల కారణంగానే ఆమె ఆ పేరు పెట్టిందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే జాన్వీని మాస్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునే విధంగా ఒక ప్రత్యేక క్యారెక్టర్‌లో బుచ్చిబాబు చూపించారు. స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, పాత్రకు అవసరమైన అన్ని షేడ్స్‌ను బయటకు తీసుకురావాలనే డైరెక్ట‌ర్ ఆలోచన స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ప్రయోగం అందరికీ నచ్చలేదు. ఒక వర్గం ప్రేక్షకులు జాన్వీ యాక్టింగ్ ను ప్రశంసిస్తూ అచ్చియమ్మ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెబుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఈ పాత్రపై ట్రోల్స్ కూడా భారీగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు ఇష్టపడినా, విమర్శించినా అచ్చియమ్మ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. సినిమాలోని ఒక పాత్ర రిలీజైన త‌ర్వాత డిస్క‌ష‌న్ కు కేంద్రబిందువుగా మారిందంటే దాన్ని డైరెక్ట‌ర్ స‌క్సెస్ గానే చూడాల‌నే అభిప్రాయం కూడా కొంద‌రిలో వ్యక్తమవుతోంది. షూటింగ్ సమయంలో ఎక్కువ టేక్‌లు తీసుకున్నందుకే కాదు, అచ్చియమ్మలాంటి పోకిరి పిల్ల పాత్ర‌ను ఇంత ధైర్యంగా తీర్చిదిద్దినందుకే జాన్వీ బుచ్చిబాబును రౌడీ డైరెక్టర్ అని పిలిచిందేమో! అని ఇప్పుడంద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News