అప్పుడు ఐదేళ్లు.. ఇప్పుడంత గ్యాప్ వద్దు బుచ్చి!
దీంతో ఇప్పుడు బుచ్చిబాబు తర్వాతి స్టెప్ ఏంటన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఒక సినిమా హిట్ అయితే దర్శకుడి దగ్గర కథలతో పాటు అవకాశాలు కూడా క్యూ కడతాయి. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఉప్పెనతో ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీతో తన ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. దీంతో ఇప్పుడు బుచ్చిబాబు తర్వాతి స్టెప్ ఏంటన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే బుచ్చిబాబు కెరీర్ లో ఇప్పుడు ఒక విషయం మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉప్పెన తర్వాత రెండో సినిమా పెద్ది రావడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. 2021లో ఉప్పెన మూవీ రిలీజ్ అవ్వగా, 2026 మార్చిలో పెద్ది మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ గ్యాప్ లో సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఈసారి అంత సమయం వెయిట్ చేయించకూడదనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం బుచ్చిబాబు తన నెక్స్ట్ స్టోరీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన నెక్స్ట్ హీరో విషయంలో మహేష్ బాబు పేరు మెయిన్ గా వినిపిస్తోంది. ఇద్దరి మధ్య స్టోరీకి సంబంధించిన చర్చలు జరిగినట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. అయితే మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసితో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పనులు పూర్తయ్యే వరకు బుచ్చిబాబు ప్రాజెక్టుపై పూర్తి క్లారిటీ రావడం కాస్త కష్టమే.
ఇదే సమయంలో బుచ్చిబాబు మరోసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఉండేందుకు ముందుగానే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో కాంబినేషన్ పాజిబుల్ అయితే దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్లొచ్చు. ఒకవేళ మరింత సమయం పట్టే పరిస్థితి వస్తే.. మరో క్రేజీ కాంబినేషన్ తో ముందుకు వెళ్లే ఆలోచన కూడా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఆ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిరంజీవితో బుచ్చిబాబు సినిమా అంటూ వచ్చిన వార్తలు ఫేక్ అని ఇప్పుడు తెలుస్తోంది. కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు హీరో విషయంలో ఎలాంటి నిర్ణయానికి రావడం తొందరపాటే. ప్రస్తుతం అసలు ఆసక్తి మాత్రం బుచ్చిబాబు ఎప్పుడు ఎవరితో తన నెక్స్ట్ సినిమాను ప్రకటిస్తారన్నదే.
పెద్ది తర్వాత వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ.. ఈసారి స్టోరీని సిద్ధం చేసి త్వరగానే రంగంలోకి దిగాలని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2027 స్టార్టింగ్ లో తన మూడో సినిమాపై బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా ఉంది. అలా అప్పుడు ఐదేళ్లు పట్టింది.. ఇప్పుడు మాత్రం అంత గ్యాప్ వద్దు బుచ్చి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారి బుచ్చిబాబు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.