ఆ దర్శకుడు అమాయకంగా కనిపిస్తాడు కానీ..
టాలీవుడ్ దర్శకుల్లో బుచ్చిబాబు సానా అదో రకం. తన అప్పీయరెన్స్ చూస్తే.. ఇతనేం డైరెక్టర్ అన్నట్లుగా ఉంటుంది.;
టాలీవుడ్ దర్శకుల్లో బుచ్చిబాబు సానా అదో రకం. తన అప్పీయరెన్స్ చూస్తే.. ఇతనేం డైరెక్టర్ అన్నట్లుగా ఉంటుంది. సుకుమార్ లాంటి పెద్ద దర్శకుడి స్కూల్ నుంచి వచ్చినప్పటికీ, తొలి సినిమా ‘ఉప్పెన’తో వంద కోట్ల వసూళ్లు రాబట్టినప్పటికీ.. అతనేమీ బిల్డప్ ఇవ్వడు. ఇప్పటికీ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ లాగే ప్రవర్తిస్తుంటాడు. సుకుమార్ దగ్గరే కాదు.. ఇంకే ఫిలిం సెలబ్రెటీ పక్కన ఉన్నా సరే.. చేతులు కట్టుకుని నిలబడతాడు. కుచించుకుపోయినట్లు కనిపిస్తాడు.
స్టేజ్ మీద మాట్లాడేటపుడు కూడా అదే తీరు. తాజాగా అతను అల్లు శిరీష్ ప్రి వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చాడు. అక్కడ కూడా చేతులు కట్టుకుని వినమ్రంగా నిలబడ్డాడు. ఈ విషయంలో అతి వినయం ప్రదర్శిస్తాడంటూ అతణ్ని ట్రోల్ చేసే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ అతడిలో ఏ మార్పూ ఉండదు. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం లేనట్లు, అమాయకుడన్నట్లుగా కనిపిస్తాడు కానీ.. తన పనితనం చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.
రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్‌తో ‘పెద్ది’ సినిమా చేస్తున్న బుచ్చిబాబు.. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రోమోతోనూ అమితంగా ఆకట్టుకున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా బ్యాటింగ్ మూమెంట్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. తర్వాతి చికిరి పాట అంతకుమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ‘రారా రైరా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తే.. ఇదీ ఇన్‌స్టంట్ హిట్టయింది. ఇందులో విజువల్స్, ఫ్రేమ్స్, చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ చూసి అందరూ షాకైపోయారు.
ఒక చిన్న సినిమా తీసిన దర్శకుడు చరణ్ లాంటి టాప్ స్టార్‌ను డీల్ చేస్తున్న విధానం.. టెక్నీషియన్ల నుంచి రాబట్టుకుంటున్న పనితనం.. ఓవరాల్ ఔట్ పుట్.. ఆ క్వాలిటీ అదీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక స్పెషల్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ అతను తెప్పిస్తున్నాడు. తెలుగు సినిమాలతో పెద్దగా అసోసియేషన్ లేని ఏఆర్ రెహమాన్‌ను ‘పెద్ది’ని ఇంతగా ఓన్ చేసుకుని అదిరిపోయే పాటలు ఇస్తుండడంలోనూ బుచ్చిబాబు శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. పైకి అమాయకంగా కనిపిస్తాడు కానీ.. బుచ్చిబాబు అసాధ్యుడు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా సినిమాలోనూ ఇదే ఔట్ పుట్ తీసుకురాగలిగితే ‘పెద్ది’తో అతడి రేంజే మారిపోవడం ఖాయం.