బుచ్చి ఐదేళ్ల నిరీక్షణ వెనుక ఉన్న కథ ఇదే!

చాలా మంది డైరెక్ట‌ర్లు మొద‌టి స‌క్సెస్ త‌ర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారు. కానీ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గంలో వెళ్లాల్సి వ‌చ్చింది.

Update: 2026-06-03 10:03 GMT

ఒక డైరెక్ట‌ర్ కెరీర్‌లో మొద‌టి సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ఎంత గొప్ప విషయమో, ఆ స‌క్సెస్ ను కంటిన్యూ చేస్తూ రెండో సినిమాతో ఆడియ‌న్స్ ముందుకు రావడం అంతకంటే పెద్ద సవాల్. చాలా మంది డైరెక్ట‌ర్లు మొద‌టి స‌క్సెస్ త‌ర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారు. కానీ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గంలో వెళ్లాల్సి వ‌చ్చింది.

ఉప్పెన లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ఆయ‌న్నుంచి సినిమా రావ‌డానికి ఐదేళ్లు ప‌ట్టింది. చాలా గ్యాప్ త‌ర్వాత బుచ్చిబాబు ఇప్పుడు పెద్దితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఆలస్యంపై ఇప్పటివరకు అనేక ఊహాగానాలు వినిపించినా, తాజాగా బుచ్చిబాబు వెల్లడించిన విషయాలు ఈ జ‌ర్నీ వెనుక ఉన్న పట్టుదల, నమ్మకం, ఎమోష‌న్స్ ను బయటపెట్టాయి. ఈ ఐదేళ్లు కేవలం సినిమా రూపొందడానికి పట్టిన టైమ్ కాద‌ని, తాను కోరుకున్న హీరోతో సినిమా చేయాలనే సంకల్పం నెరవేరడానికి పట్టిన కాల‌మ‌ని బుచ్చిబాబు చెప్తున్నారు.

ఉప్పెన రిలీజై భారీ హిట్టైన తర్వాత కూడా ఆయన వెంటనే తదుపరి సినిమా ప్రారంభించలేదు. బుచ్చిబాబు గురువు సుకుమార్ సహాయంతో హీరో రామ్ చరణ్ వద్దకు వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ, ఆ దశకు చేరుకోవడానికే రెండున్నరేళ్ల టైమ్ ప‌ట్టింద‌ని బుచ్చి అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. చరణ్‌కు కథ చెప్పడానికి వెళ్లే ముందు దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ, "ఈ కథలో ఒక్క మార్పు కూడా చెప్పకుండా ఓకే చేయాలి" అని మొక్కుకున్నానని, ఆశ్చర్యకరంగా కోరుకున్నట్లుగానే చరణ్ కథ విన్న వెంటనే ఎలాంటి మార్పులు సూచించకుండా అంగీకరించారని తెలిపారు.

ఈ పరిణామం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. నేటి స్టార్ హీరోల సినిమాల్లో కథలు అనేక దశల్లో మార్పులకు గురవడం సాధారణం. కానీ ఒక డైరెక్ట‌ర్ చెప్పిన కథను యథాతథంగా నమ్మి ముందుకు వెళ్లడం అరుదైన విషయం. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఉన్న స్టార్ హీరో నుంచి అలాంటి విశ్వాసం రావడం బుచ్చిబాబు లాంటి డైరెక్ట‌ర్ కు పెద్ద గుర్తింపుగా భావించవచ్చు. అందుకే ఈ సినిమా చేసినందుకు తాను చరణ్‌కు ఎప్పటికీ ఋణపడి ఉంటానని బుచ్చిబాబు చెప్పడం వెనుక కేవలం మర్యాద మాత్రమే కాదు, తనపై ఉంచిన నమ్మకానికి వ్యక్తీకరణ కూడా ఉంది. కథను నమ్మిన హీరో, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనే డైరెక్ట‌ర్ బాధ్యత కలిసి పెద్ది సినిమాని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్‌గా మ‌ర‌ల్చాయి.

సాధారణంగా ఐదేళ్ల గ్యాప్‌ను ఇండస్ట్రీలో నెగెటివ్‌గా చూస్తారు. కానీ బుచ్చిబాబు జ‌ర్నీని పరిశీలిస్తే, అది ఆలస్యం కంటే ఒక సృజనాత్మక నిరీక్షణగా కనిపిస్తోంది. సరైన కథ, సరైన హీరో, సరైన సమయం కోసం ఎదురుచూసిన ఆయన ఇప్పుడు పెద్దితో ప్రేక్షకుల తీర్పు కోసం సిద్ధమయ్యారు. ఉప్పెన తర్వాత వచ్చిన ఈ లాంగ్ గ్యాప్ స‌క్సెస్ గా మారితే, అది కేవలం మరో హిట్‌గా కాకుండా ఓ డైరెక్ట‌ర్ నమ్మకం, ఓ హీరో విశ్వాసం కలిసి సాధించిన విజయంగా నిలిచిపోవడం ఖాయం.

Tags:    

Similar News