తెలుగు సినిమాలపై బాలీవుడ్ ఆర్టిస్టుల కొత్త ప్రేమ
టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ నటులు కనిపించడం పెద్ద విషయం కాదు. అమితాబ్ బచ్చన్ నుంచి సంజయ్ దత్ వరకు ఎంతోమంది హిందీ నటులు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు చేశారు.
టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ నటులు కనిపించడం పెద్ద విషయం కాదు. అమితాబ్ బచ్చన్ నుంచి సంజయ్ దత్ వరకు ఎంతోమంది హిందీ నటులు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. కానీ వాళ్ల ప్రమోషన్ స్టైల్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. షూటింగ్ పూర్తైన తర్వాత సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తాన్ని హీరో, డైరెక్టర్ టీమ్‌పైనే వదిలేసేవారు. మీడియా ఇంటర్వ్యూలకు రావడం, తెలుగు సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం చాలా అరుదుగా కనిపించేది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌కు ముందు బాలీవుడ్ నటుల యాటిట్యూడ్ సినిమా చేసేశాం, మిగతాది మీరే చూసుకోండి అన్నట్టే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. దానికి తాజా ఉదాహరణగా మారింది రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బోమన్ ఇరానీ ప్రస్తుతం ముంబై మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ది గురించి చేస్తున్న వ్యాఖ్యలు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. పెద్ది సినిమాకు సల్మాన్ ఖాన్ సుల్తాన్, అమీర్ ఖాన్ దంగల్ సినిమాలతో పోలికలు రావడం సహజమని, కానీ ట్రైలర్‌లో చూసింది అసలు సినిమా కాదని, పెద్ది ఆడియన్స్ ను ఎమోషన్స్ గా వెంటాడే సినిమా అని ఆయన చెప్పడం నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదే సమయంలో దివ్యేందు శర్మ కూడా సినిమాలో తన క్యారెక్టర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు. అందరూ తనను సినిమాలో విలన్ అనుకుంటున్నారని, కానీ తెరపై కనిపించే పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెబుతూ క్యారెక్టర్ చుట్టూ సస్పెన్స్ పెంచుతున్నారు. గతంలో తెలుగు సినిమాల్లో నటించిన పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులు ప్రమోషన్లలో అంతగా పాల్గొనని సందర్భాలుండగా, ఇప్పుడు మాత్రం పెద్ది కోసం బాలీవుడ్ నటులే స్వయంగా ప్రచార యోధుల్లా మారడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా కనిపిస్తోంది.
దీనికి మరో ప్రధాన కారణంగా జియో స్టూడియోస్ ప్లానింగ్‌ను ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. నార్త్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా కోసం హిందీ మీడియా ప్రమోషన్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం. భోపాల్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ఈ హైప్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ట్రైలర్‌పై సోషల్ మీడియాలో మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం బజ్ ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ టాక్. ముఖ్యంగా బోమన్ ఇరానీ లాంటి సీనియర్ నటుడు ఇంత బలంగా సినిమాను ఎలివేట్ చేయడం చూసి అభిమానులు కూడా పెద్ది కంటెంట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.
అత్తారింటికి దారేది తర్వాత తెలుగు మార్కెట్‌లో బోమన్‌కు పెద్ద విజయాలు రాకపోయినా.. ఈసారి మాత్రం ఆయన నమ్మకంగా మాట్లాడటం వెనుక సినిమాలో బలమైన భావోద్వేగ కంటెంట్ ఉందని నమ్ముతున్నారు. మొత్తానికి పెద్ది ప్రమోషన్స్ చూస్తుంటే టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ ఇకపై కేవలం సౌత్ ప్రాజెక్ట్స్ గా కాకుండా, నేషనల్ లెవెల్ మార్కెట్‌ను ప్రభావితం చేసే బ్రాండ్లుగా చూడటం ప్రారంభించిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.