విడ్డూరం : సీక్వెల్స్ పేరుతో సినిమా వారి మోసం..!
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు విడుదలకు ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం కీలకం.;
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు విడుదలకు ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం కీలకం. ఫ్లాప్ మూవీ అయినా పబ్లిసిటీ సరిగ్గా పడితే మినిమం ఓపెనింగ్స్ నమోదు కావడం మనం చూస్తూ ఉన్నాం. హిట్ టాక్ వచ్చిన సినిమాలకు సరిగ్గా పబ్లిసిటీ లేకపోవడంతో ఓపెనింగ్స్ లేక, లాంగ్ రన్‌లోనూ సినిమా తీవ్రంగా నష్ట పరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రమోషన్ అనేది సినిమాలకు కీలకం. ఇప్పుడు ఆ ప్రమోషన్ దక్కాలంటే సినిమా గురించి జనాల్లో చర్చ జరగాలి. అలా చర్చ జరగాలి అంటే కొన్ని మార్గాలను మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకటి సీక్వెల్.
ఒక హిట్ సినిమాకు సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంటుంది. ఎలాగూ ఆ సినిమా హిట్ అయింది కనుక కాస్త అటు ఇటుగా అయినా ఈ సినిమా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే, కొందరు హిట్ సినిమా ప్రాంచైజీ అంటున్నారు. తెలుగులో హిట్ ప్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. బాలీవుడ్‌లో హౌస్ ఫుల్ ప్రాంచైజీలో ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. ధూమ్, డాన్, భాఘీ ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌లో సీక్వెల్స్, ప్రాంచైజీ సినిమాల సంఖ్య చాంతాడంత ఉంటుంది.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఈ మధ్య కాలంలో హిట్ ప్రాంచైజీ పేరుతో తీసుకు వచ్చిన సినిమాలు, సీక్వెల్స్ పేరుతో తీసుకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. కొన్ని సినిమాలు మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉంటే ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. సౌత్‌లో రూపొంది సూపర్ హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి, ఆ రీమేక్‌లకు సీక్వెల్స్ చేస్తున్న సంస్కృతి బాలీవుడ్‌లో ఉంది. కేవలం టైటిల్ బ్రాండ్ వ్యాల్యూ కారణంగా సినిమా ఎంతో కొంద అయినా జనాలకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా ఫిల్మ్ మేకర్స్ ముందు కథకు, తర్వాత వచ్చే కథకు సంబంధం లేకున్నా సీక్వెల్ అంటున్నారు.
సౌత్‌లోనూ ఇలా సీక్వెల్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. కానీ బాలీవుడ్‌లో ఇది ఎక్కువగా ఉంది. ప్రతి ఏడాది డజనుకు పైగా సీక్వెల్ సినిమాలు, ప్రాంచైజీ సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు హిట్ కాకపోగా, కొన్ని అంతకు ముందు వచ్చిన ఒరిజినల్ సినిమాల పేరును పాడు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాంచైజీ సినిమాలకు, సీక్వెల్ సినిమాలకు ఉన్న పాజిటివ్ బజ్‌ను కాస్త ఇలా కొందరు వాడుకుంటున్న కారణంగా పాడు చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో సీక్వెల్ పేరుతో కొందరు సినిమాలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు వచ్చిన సినిమా కథకు, పాత్రలకు సంబంధం లేకుండా తర్వాత వచ్చిన సినిమాలు ఉంటే సీక్వెల్ ఎలా అంటారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రాంచైజీ అర్థాలను కూడా బాలీవుడ్ మేకర్స్ మార్చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి ఏ మాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.