బంధుప్రీతి.. రెండు వైపులా ప‌దును ఉన్న క‌త్తి లాంటిది

బాలీవుడ్ ప్ర‌తిభ‌, నిరంత‌ర కృషి ద్వారా ఎదిగేందుకు ఆస్కారం ఉన్న ఒక స్థ‌లం. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లేదా ఇంకేదైనా పెద్ద బ్యాన‌ర్ ఛాన్సిస్తేనే అవ‌కాశాలు క‌ల్పించిన‌ట్టు కాదు.;

Update: 2026-01-06 18:30 GMT

సినీప‌రిశ్ర‌మ‌ల్లో చాలా కాలంగా నేపోటిజం, బంధుప్రీతి గురించి చ‌ర్చ సాగుతోంది. ఇది ఎప్ప‌టికీ అంతూద‌రీ లేని డిబేట్. ఎండ్‌లెస్ గా సాగుతుంది. ప‌రిశ్ర‌మ‌ను ఇన్ సైడ‌ర్స్ - ఔట్ సైడ‌ర్స్ గా విభ‌జించి చూడ‌టానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ప‌రిశ్ర‌మ‌ని ఏల్తున్న ప్ర‌ముఖ స్టార్ల న‌ట‌వార‌సులు లేదా పేరున్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల పిల్ల‌ల‌కు ఉండే అండ‌దండ‌లు, ఔట్ సైడ‌ర్స్ కి ఎప్ప‌టికీ ఉండ‌వు అనేది వాస్త‌వం. ఒక‌టికి ప‌దిసార్లు ఫ్లాపులు ఎదురైనా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవ‌డానికి నేపో కిడ్స్ కి అవ‌కాశాలుంటాయి. కానీ ఔట్ సైడ‌ర్ ప్రతి సినిమాతో నిరూపించాలి. ఎక్క‌డ ఫ్లాప్ ఎదురైనా బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ సామాన్లు స‌ర్ధుకోవాల్సిందే.

కంగన ర‌నౌత్, కార్తీక్ ఆర్య‌న్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావులా ట్యాలెంట్ తో ఇక్క‌డ నెగ్గుకు రావాలి. ప్ర‌తిభ‌, హార్డ్ వ‌ర్క్ తో పాటు అదృష్టం క‌లిసొస్తేనే ఔట్ సైడ‌ర్స్ ఇక్క‌డ నిల‌దొక్కుకోగ‌ల‌రు. అయితే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఇన్ సైడ‌ర్స్- ఔట్ సైడ‌ర్ అనే కోణంలో చూడ‌కూడ‌ద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత జోయా అక్త‌ర్ వ్యాఖ్యానించ‌డం మ‌రోసారి ఆన్ లైన్ లో పెద్ద డిబేట్ కి తెర‌తీసింది.

బాలీవుడ్ ప్ర‌తిభ‌, నిరంత‌ర కృషి ద్వారా ఎదిగేందుకు ఆస్కారం ఉన్న ఒక స్థ‌లం. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లేదా ఇంకేదైనా పెద్ద బ్యాన‌ర్ ఛాన్సిస్తేనే అవ‌కాశాలు క‌ల్పించిన‌ట్టు కాదు. చిన్న- పెద్ద బ్యాన‌ర్లలో ఎక్క‌డో ఒక చోట ప‌ని చేసేవాళ్లు అంద‌రూ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మే. ప్ర‌తియేటా సినీరంగంలోకి ప్ర‌వేశించే చాలా మంది సినిమా కుటుంబాల నుంచి రాలేదనేది గుర్తించాలి. చాలామంది సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇండ‌స్ట్రీలో అర్థ‌వంత‌మైన ప‌నిని పొందేవారు ముంబై బ‌య‌టి నుంచి వ‌స్తున్నారని త‌న అభిప్రాయం చెప్పారు జోయా అక్త‌ర్. అలాగే రీమా క‌గ్తీ లాంటి ప్ర‌ముఖురాలు తాను మొద‌టి సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి ఏడేళ్ల పాటు ఎదురు చూడాల్సి వ‌చ్చింద‌ని, త‌న స‌హాయ‌కులు ఒక‌రు తాను డైరెక్ట్ చేయ‌డానికి ముందే ఓ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం చేసేసార‌ని కూడా తెలిపారు.

అయితే జోయా అక్త‌ర్, రీమా క‌గ్తీ ఇద్ద‌రూ పాపుల‌ర్ సినీకుటుంబాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తులు. అలాంటి వారు మాట్లాడే విష‌యాలు ప్రామాణిక‌త‌గా తీసుకోకూడ‌ద‌ని కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. బంధుప్రీతిపై వారు ఇచ్చే వివ‌ర‌ణ‌లు స‌రైన‌వి కావ‌ని కూడా అంటున్నారు. దీనికి ఒక ఉదాహ‌ర‌ణ‌ను కూడా చెబుతున్నారు. వ‌రుణ్ ధావ‌న్ - జాన్వీక‌పూర్, జిమ్ స‌రాఫ్- స‌న్య మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `స‌న్నీ సంస్కారీకి తుల‌సి కుమారి`ని ఉద‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాలో జిమ్-స‌న్యల న‌ట‌న నేపోకిడ్స్ వ‌రుణ్- జాన్వీ న‌ట‌న కంటే చాలా అద్భుంగా ఉంటుంద‌ని కితాబిచ్చారు. జిమ్- స‌న్య స‌హాయ‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌గా, వ‌రుణ్‌- జాన్వీ జోడీ ప్ర‌ధాన లీడ్ పాత్ర‌ల్లో క‌నిపించార‌ని, అలా వారిని సెట్ చేసార‌ని, ఇదంతా బంధుప్రీతి మ‌హిమ అని కూడా వాదిస్తున్నారు. సినీకుటుంబాల నుంచి వ‌చ్చిన వారికి ఇచ్చే ప్రాధాన్య‌త‌, ఔట్ సైడ‌ర్స్ కి ఇవ్వ‌ర‌నడానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు.

అయితే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ దీనిని ఎప్ప‌టికీ అంగీక‌రించ‌రు. తాను చాలా మంది ప‌రిశ్ర‌మ ఔట్ సైడ‌ర్స్ ని కూడా వెండితెర‌కు ప‌రిచ‌యం చేసాన‌ని, కానీ దానికి గుర్తింపు ద‌క్క‌లేద‌ని, కేవ‌లం న‌ట‌వార‌సుల‌ను ప‌రిచయం చేసిన‌ప్పుడే దాని గురించి ఎక్కువ ప్ర‌చారం సాగుతోంద‌ని వాపోయారు. అయితే ఇండ‌స్ట్రీని సునిశితంగా ప‌రిశీలిస్తే కొన్ని విష‌యాల‌ను ఎవ‌రైనా స్ప‌ష్ఠంగా అర్థం చేసుకోవ‌చ్చు.

న‌ట‌వార‌సులు అయినా ఈ రంగంలో నిరూపించుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్ర‌తిభ‌ను నిరూపించ‌లేక‌పోతే ప్ర‌జ‌లు నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తారు. పెద్ద నిర్మాణ సంస్థ‌లు అండ‌గా నిల‌వ‌క‌పోయినా ప్ర‌తిభావంతుల‌ను ఎవ‌రూ ఆప‌లేరు. కార్తీక్ ఆర్య‌న్, ఆయుష్మాన్, రాజ్ కుమార్ రావు లాంటి ప్ర‌తిభావంతుల‌ను నిలువ‌రించ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ప్ర‌తిభ ఉన్న ఔట్ సైడ‌ర్స్ కి అవ‌కాశాలిచ్చేందుకు కొంద‌రు ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. అయితే ఔట్ సైడ‌ర్స్ ఎప్పుడూ త‌మ సంబంధాల‌ను మెరుగుప‌రుచుకుంటూ, కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌తిభ‌తో దూసుకెళ్లాల్సి ఉంటుంది. బంధుప్రీతి.. రెండు వైపులా ప‌దును ఉన్న క‌త్తి లాంటిది. అది ఎటువైపు ఎవ‌రికి ముప్పుగా మారుతుందో చెప్ప‌లేం!

Tags:    

Similar News