ప్రముఖ నటి సులక్షణ పండిట్ కన్నుమూత.. ఏమైందంటే?
చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటిగా , గాయనిగా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సినీ పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్న సులక్షణ పండిట్ గురువారం రోజు తుది శ్వాస విడిచారు.;
చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటిగా , గాయనిగా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సినీ పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్న సులక్షణ పండిట్ గురువారం రోజు తుది శ్వాస విడిచారు. ఛాతీలో నొప్పి రావడంతో దగ్గర్లోని నానావతి హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా.. మార్గం మధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు ఆమె సోదరుడు లలిత్ పండిట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సులక్షణ పండిట్ వయసు 71 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సులక్షణ వ్యక్తిగత జీవితం , కెరియర్ విషయానికి వస్తే.. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అనగా 1970 - 80వ దశకంలో బడా స్టార్ హీరోలతో కలిసి పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా జితేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా , అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, శశి కపూర్ వంటి బడా హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె.. ఎన్నో పాటలు కూడా పాడింది. తన నటనతో పాటు గాత్రంతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఒకానొక సమయంలో దురదృష్టవంతురాలు అని కూడా పిలిపించుకుంది. కారణం తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేయకపోవడమే.
ముఖ్యంగా ఒక హీరోను మనసారా ప్రేమించిన ఈమె.. అతడితో జీవితాన్ని బలంగా కోరుకుంది. తన మొదటి సినిమా ఉల్జాన్ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ హీరోతో ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే ఆ హీరో మరో హీరోయిన్ ని ప్రేమించడమే కాకుండా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ ఆ హీరోయిన్ నుంచి ఎటువంటి సానుకూల ఫలితం రాకపోయేసరికి.. ఆమెను మర్చిపోలేక బ్రహ్మచారిగా మిగిలిపోయాడు ఆ హీరో.
ఆ సమయంలో ఆ హీరో తీసుకున్న నిర్ణయం సులక్షణ పండిట్ కి మింగుడు పడలేదు. దాంతో ఎలాగైనా అతడిని ఒప్పించి అతనితో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. దాంతో ఆమె కూడా ఎవరిని పెళ్లి చేసుకోకుండా అతడి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఒంటరిగా గడిపేయాలని నిర్ణయించుకుంది. అలాంటి సమయంలో 1985లో 47 ఏళ్ల వయసులో ఆ హీరో గుండెపోటుతో మరణించాడు. పెళ్లి చేసుకోకపోయినా అతడినే భర్తగా ఊహించుకున్న సులక్షణ పండిట్ మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని సులక్షణ సోదరి విజేత పండిట్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కూడా..
తన సోదరీ కళ్ళముందే జీవచ్ఛవంలా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయినా విజేత పండిట్ తనను ఇంటికి తీసుకొచ్చింది. కానీ ఆమెను మామూలు మనిషిని చేయలేక పోయిందట. నాలుగు గోడల మధ్య జీవత్సవంలా బ్రతుకుతూ ఉన్న ఈమెకి ఒకసారి బాత్రూంలో కాలుజారి నాలుగు సర్జరీలు కూడా జరిగాయి. కానీ ఫలితం లేకుండా పోయిందట. నడవలేని స్థితిలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొందట సులక్షణ. అయితే ఇప్పుడు ఆమె కూడా గుండెపోటుతో మరణించడంతో అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు .