బాలీవుడ్ భామలు - గ్లామర్ వర్సెస్ యాక్టింగ్!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీని చూస్తే? `దేవర` సినిమాతో అమ్మ‌డు తెలుగులో లాచ్ అయిన‌ప్పుడు శ్రీదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుందని ఆశించారు.

Update: 2026-06-07 04:30 GMT

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు కథానాయికలను దిగుమతి చేసుకోవడం అనేది దశాబ్దాలుగా సాగుతున్న ఆనవాయితీ. ముంబై ముద్దుగుమ్మలకు ఉండే క్రేజ్.. గ్లామర్ అప్పీల్ సినిమా వ్యాపారానికి ప్లస్ అవుతుందనేది మేకర్స్ నమ్మకం. అయితే ఈ మధ్య కాలంలో భారీ పారితోషకాలు ఇచ్చి నార్త్ బ్యూటీలను టాలీవుడ్‌కు తీసుకు వస్తున్న దర్శకులు వారిలోని నటనను పక్కనబెట్టి అందాల ఆరబోతకే పరిమితం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసమే హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌గా ప‌రిమితం చేస్తున్నార‌నే చర్చ సినీ వర్గాల్లో ఊపందుకుంది.

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీని చూస్తే? `దేవర` సినిమాతో అమ్మ‌డు తెలుగులో లాచ్ అయిన‌ప్పుడు శ్రీదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుందని ఆశించారు. కానీ దర్శకుడు కొరటాల శివ జాన్వీ పాత్రను పాటలకే పరిమితం చేసి.. గ్లామర్ డోస్‌ను మాత్రమే హైలైట్ చేశారనే విమ‌ర్శ ఉంది. తాజాగా విడుదలైన `పెద్ది` సినిమాలోనూ ఇదే పునరావృతమైంది. రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నా? జాన్వి పోషించిన `అచ్చి అమ్మ` పాత్ర మాత్రం అందాల ఆరబోత చుట్టూనే తిరగడం గమనార్హం.

అలాగే `కల్కి 2898 AD` మొదటి భాగంలో దిశా పటాని పోషించిన రోక్సీ పాత్ర కేవలం కథానాయకుడితో డ్యూయెట్ పాడుకోవడానికి స్క్రీన్‌పై గ్లామర్ జోడించడానికే అన్నట్లుగా సాగింది. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `లైగర్` సినిమాలో అనన్య పాండే పాత్ర- `గేమ్ ఛేంజర్` చిత్రంలో కియారా అద్వానీ పాత్రలు సైతం కథకు పెద్దగా బలాన్ని ఇవ్వకుండా గ్లామర్ హంగుల కోసమే అన్నట్లుగా డిజైన్ చేసారు. దీంతో నటీమణులుగా వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది.

అలాగని దర్శకులందరూ నార్త్ హీరోయిన్లను ఒకేలా చూపించడం లేదు. కొందరు స్టార్ డైరెక్టర్లు బాలీవుడ్ భామలలోని నటనకు పదును పెడుతూ గుర్తింపు తెచ్చే హుందాతనమైన పాత్రలను సృష్టిస్తున్నారు. రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్‌ను సీత పాత్రలో ఎంతో హుందాగా, భావోద్వేగభరితంగా చూపించారు. పరిమిత స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ అలియాభ‌ట్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమర్షియల్ హంగుల కోసం సీత పాత్ర‌ను హైలైట్ చేసారు.

అలాగే దర్శకుడు నాగ అశ్విన్ సైతం `కల్కి` ప్రపంచంలో దీపికా పదుకొనేను గౌరవప్రదమైన పాత్రలో ఆవిష్క రించారు. ఒక తల్లిగా ఆమె పడే వేదనను నటన సీన్లతో అద్భుతంగా పండించారు. తాజాగా ప్రచారంలో ఉన్న `రాకా` చిత్రంలోనూ దీపికా పాత్రే కీలకం కానుందని తెలుస్తోంది. `ఆదిపురుష్` చిత్రంలో కృతి సనన్ జానకిగా మెప్పించగా.. మరో గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా సైతం `వారణాసి` నేపథ్యంలో సాగే చిత్రంలో నటనకు ఆస్కారమున్న పాత్రలో నటిస్తోంది. ఇలా కొంద‌రు దర్శకులు నటీమణుల పారితోషకానికి పూర్తి న్యాయం చేస్తూ వారి ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.

ముంబై ముద్దుగుమ్మలను గ్లామర్ షోకే పరిమితం చేయాలా? లేక? వారిలోని నటిని వాడుకోవాలా అనేది పూర్తిగా దర్శకుల విజన్ - కథా బలంపైనే ఆధారపడి ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాల్లో గ్లామర్ ఒక భాగమే అయినా? కేవలం దాని కోసమే పాత్రలను సృష్టించడంతో కథనంలో సహజత్వం లోపిస్తుంది. ఇప్పటికైనా టాలీవుడ్ మేకర్స్ విషయాన్ని గమనించి నార్త్ హీరోయిన్ల నుంచి అందాలనే కాకుండా అద్భుతమైన అభినయాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేయాలని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Tags:    

Similar News