సృజనాత్మక స్వేచ్ఛ - సామాజిక అసహనం!

తాజాగా ఇటీవల మనోజ్ బాజ్‌పాయ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒక వివాదాస్పద సంఘటన (ఘూస్ ఖోర్ పండిట్ వివాదం) గురించి ఓపెన్ అయిన‌ విషయాలు ఇండస్ట్రీలో చర్చనీ యాంశంగా మారాయి.

Update: 2026-05-31 09:30 GMT

సహజమైన.. వైవిధ్యభరితమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన న‌టుడు మనోజ్ బాజ్‌పాయ్. సమాజంలోని నిగూఢ సత్యాలను, వివాదాస్పద అంశాలను తన పాత్రల ద్వారా వెండితెరపై ఆవిష్కరించడంలో మ‌నోజ్ ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో వాస్తవిక కథలను ఎంచుకోవడం అనేది నటీనటులకు పెద్ద సవాలుగా మారుతోంది. కళాత్మక స్వేచ్ఛకు.. సామాజిక భావోద్వేగాలకు మధ్య జరిగే ఘర్షణలో నటులు తీవ్రమైన వ్యతిరేకతను.. వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఇటీవల మనోజ్ బాజ్‌పాయ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒక వివాదాస్పద సంఘటన (ఘూస్ ఖోర్ పండిట్ వివాదం) గురించి ఓపెన్ అయిన‌ విషయాలు ఇండస్ట్రీలో చర్చనీ యాంశంగా మారాయి.

సినిమా లేదా పాత్ర సమాజంలోని ఒక వర్గాన్ని కానీ.. సంప్రదాయాలను కానీ విమర్శించినట్లు అనిపిస్తే దానిపై వచ్చే స్పందనలు విమర్శలకే పరిమితం కావడం లేదు. ఆ వివాదం సమయంలో తాను ఊహించని స్థాయిలో వ్యక్తిగత బెదిరింపులను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. కథలోని సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ఒక డైలాగ్ .. క్యారెక్టరైజేషన్ ఆధారంగా నటులను టార్గెట్ చేయడం నేటి సోషల్ మీడియా కాలంలో ప్రమాదకరమైన ధోరణిగా మారిందని ఆవేదన చెందారు. ఈ వివాదంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే? సదరు నటుడి కుటుంబ సభ్యులను కూడా ఈ గొడవల్లోకి లాగడం. తాను ఒక నటుడిగా విమర్శలను, వృత్తిపరమైన ఒడిదుడుకులను తట్టుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉంటానన్నారు.

కానీ ఏ తప్పు చేయని తన భార్యను, పిల్లలను వివాదంలోకి లాగి బెదిరింపులకు గురిచేయడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఒక కళాకారుడి వ్యక్తిగత జీవితంలో ఎంతటి మానసిక ఆందోళనను, అభద్రతాభావాన్ని సృష్టిస్తాయో? ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్ర‌స్తుత‌ కాలంలో బాయ్‌కాట్ సంస్కృతి .. ఆన్‌లైన్ ట్రోలింగ్ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇలాంటి ఒత్తిళ్లు ఎదురైనా మనోజ్ బాజ్‌పాయ్ తన వృత్తిపై నిబద్ధతను ఎక్కడా కోల్పోలేదు. సినిమా అనేది సమాజానికి అద్దం పట్టేలా ఉండాలని.. కేవలం ప్రేక్షకులను సంతోషపెట్టడమే కాకుండా వారిని ఆలోచింపజేసేలా ఉండాలని బలంగా నమ్ముతాన‌న్నారు.

బెదిరింపులకు భయపడి వాస్తవాలను దాచిపెట్టి సినిమాలు చేయడం నిజమైన కళాకారుడి లక్షణం కాదని ఈ సందర్భంగా నిరూపించారు. మనోజ్ బాజ్‌పాయ్ ఎదుర్కొన్న అనుభవాలు వ్యక్తిగత సమస్య కాదని.. ఇది మొత్తం చిత్ర పరిశ్రమ భవిష్యత్తులో ఎదుర్కోబోయే సృజనాత్మక సంక్షోభానికి ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావి స్తున్నారు. ప్ర‌స్తుతం మ‌నోజ్ బాజ్ పాయ్ ప‌లు బాలీవుడ్ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెండి తెర‌ను మించి బుల్లి తెర సీరిస్ ల‌తో ఎంతో ఫేమ‌స్ అయ్యారు.

Tags:    

Similar News