చిరు-ప‌వ‌న్ ల‌క్ష‌ల్లో దాన‌మిచ్చినా ప్ర‌చారం కోరుకోరు: బాబి

దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన వ్యక్తిత్వం.. మంచి మ‌న‌సును, గొప్పతనాన్ని త‌న స్పీచ్‌లో ఆవిష్కరించారు.

Update: 2026-08-22 04:40 GMT

ఆగ‌స్టు 22.. మెగాస్టార్ బ‌ర్త్ డే ని పుర‌స్క‌రించుకుని అభిమానులు సెల‌బ్రేష‌న్స్ ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ మీట్ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు బాబి `అన్న‌య్య‌` వ్య‌క్తిత్వం, మంచిత‌నం, దాన గుణం గురించి మాట్లాడిన విష‌యాలు హైలైట్ గా నిలిచాయి.

దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన వ్యక్తిత్వం.. మంచి మ‌న‌సును, గొప్పతనాన్ని త‌న స్పీచ్‌లో ఆవిష్కరించారు. చిరంజీవి గారు కేవలం తాను మెగాస్టార్‌గా ఎదగడమే కాకుండా... తనను అభిమానించే వారిలో ఒక్కరు ఉన్నత స్థాయికి వచ్చినా అందరికంటే ఎక్కువగా ఆనందించే గొప్ప మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా ఆయనతో అత్యంత సమీపంగా ప్రయాణించిన అనుభవంతో చెప్తున్నానని.. చిరంజీవి గారిని మించిన సంస్కారం, అభిమానం ఉన్న వ్యక్తిని సమాజంలో మరెక్కడా చూడలేమని భావోద్వేగంగా వెల్లడించారు.

సినీ రంగంలో ఎదురయ్యే ప్రశంసలు, విమర్శలపై చిరంజీవి గారి దృక్పథం ఎంతో ప్రత్యేకమైనదని బాబీ వివరించారు. ఆయనను ప్రేమించే వారందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటారని... ఒకవేళ ఎవరైనా ద్వేషంతో నెగిటివ్ కామెంట్స్ లేదా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినా ఆయన ఎప్పుడూ మాటలతో సమాధానం చెప్పరని తెలిపారు. తన ప్రతి సినిమా సాధించే ఘన విజయం.. వసూలు చేసే బాక్సాఫీస్ రెవెన్యూ రూపంలోనే ఆయన విమర్శకులకు సరైన సమాధానం చెప్తారని.. అన్న‌య్య‌ సినిమా విజయం సాధించడమే అన్నింటికీ మించిన సమాధానమని అన్నారు.

మెగాస్టార్‌తో కలసి పనిచేస్తున్నప్పుడు ఆయన సినిమాపై చూపించే ప్రేమ‌, నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని బాబీ కొనియాడారు. చిరంజీవి గారికి సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదని.. సెట్స్‌లో అనవసరంగా ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృథా చేయరని తెలిపారు. అంతేకాకుండా ఆయనకు ప్రతి అభిమాని కష్టం గురించి పూర్తిగా తెలుస్తుందని అన్నారు. గతంలో `గబ్బర్ సింగ్` సినిమా రీ-షూట్ బిజీలో ఉన్న సమయంలో ఒక నటుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి.. వెంటనే పక్కకు వెళ్లి మాట్లాడి సహాయం అందించారని.. అయితే ఆ విషయాలను ఎప్పుడూ ప్రచారం చేసుకోకుండా రహస్యంగా ఉంచుతారని కొనియాడారు.

చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా సమాజంలో ఎందరికో లక్షల రూపాయల సహాయం చేస్తారని, కానీ ఆ విషయాలను బయటకు చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరని బాబీ తెలిపారు. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకునే దయాగుణం వారి సొంతమని పేర్కొన్నారు. సరిగ్గా అభిమానులకు సమయం కేటాయిస్తే బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే అపారమైన స్టామినా చిరంజీవి గారికి ఉందని, పరిశ్రమలో ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని చెప్పారు. ఇటీవల తమ కెమెరామన్ అసిస్టెంట్ కొడుక్కి రామ్ చరణ్ గారి పేరు పెట్టుకున్నాడని తెలుసుకొని.. ప్రత్యేకంగా పిలిపించి ఆశీర్వదించడం ఆయన సద్గుణానికి నిదర్శనమని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గొప్పతనాన్ని, ఆయన పరోపకార గుణాన్ని వివరించడానికి పుస్తకాలు కానీ.. రోజులు కానీ సరిపోవని అన్నారు. అన్న‌య్య‌తో గడిపిన ప్రతి క్షణం ఒక అపూర్వ అనుభవమని.. సినీ పరిశ్రమలో ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచిన అలాంటి మహా నటుడితో రెండోసారి దర్శకుడిగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News