నయా ట్రెండ్: బ్రేకప్ అయితే 'బిగ్ బాస్' బంప‌రాఫర్

బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-08-25 06:30 GMT

బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్- డ్రామా- రియల్ లైఫ్ ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ రియాలిటీ షో కంటెస్టెంట్లకు మంచి వేదిక‌. అయితే ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ బాగా కనిపించింది. ఈ షో కోసం ఎంపిక‌వ్వాలంటే కంటెస్టెంట్ల‌కు ప్ర‌ధాన అర్హ‌త ఏది? అంటే.. వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు, వివాదాలు లేదా లవ్ బ్రేకప్స్ ఎదుర్కొన్న సెలబ్రిటీలకు, ముఖ్యంగా నటీమణులకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి.

బ్రేకప్ అయిన నటీమణులకు బిగ్ బాస్ టీమ్ ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ప్రధాన కారణం `ఆడియెన్స్ క్యూరియాసిటీ`. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్.. వారి లవ్ లైఫ్‌- డివోర్స్ స్టోరీస్ తెలుసుకోవడానికి ప్రేక్షకులు తీవ్ర ఆసక్తి చూపుతారు. జీవితంలో కష్ట సమయాన్ని దాటుకుని వచ్చిన నటీమణులు హౌస్‌లో ఎమోషనల్‌గా మాట్లాడటం,.. వారి నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టడం ద్వారా షోకి భారీగా టీఆర్‌పీ ప‌ర‌మైన‌ మైలేజ్ లభిస్తుంది. అంతేకాకుండా.. బ్రేకప్ తర్వాత కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ లేదా కాంబ్యాక్ ఇవ్వాలనుకునే వారికి ఈ షో ఒక పర్‌ఫెక్ట్ రూట్‌గా మారుతోంది.

తెలుగు బుల్లితెర విషయానికి వస్తే.. దివి వద్యత‌ వంటి భామలు బిగ్ బాస్ లేదా రియాలిటీ షోలలోకి రాకముందే తమ పర్సనల్ లైఫ్ బ్రేకప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడి ప్రేక్షక లోకంలో మంచి క్యూరియాసిటీని పెంచారు. ముఖ్యంగా దివి బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగుపెట్టి తన అందంతో, వ్యక్తిత్వంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తన లైఫ్ స్టోరీని షేర్ చేసుకుంటూనే.. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచి ఆడియెన్స్ మనసులను గెలుచుకుంది.

ఇక హిందీ బిగ్ బాస్ బిగ్ స్క్రీన్‌పై ఇలాంటి ఎమోషనల్ కంబ్యాక్స్ చాలానే చూసింది. శ్వేతా తివారీ, రశ్మి దేశాయ్, ష‌మితా శెట్టి వంటి నటీమణులు తమ వ్యక్తిగత బంధాలు దెబ్బతిన్న తర్వాత లేదా విడాకుల వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి బిగ్ బాస్ వేదికగా రీ-ఎంట్రీ ఇచ్చారు. తమ రియల్ పర్సనాలిటీతో స్ట్రాంగ్ ఉమెన్ ఇమేజ్‌తో నేషనల్ లెవెల్లో విపరీతమైన పాపులారిటీ సాధించారు. శ్వేతా తివారీ ఏకంగా బిగ్ బాస్ విన్నర్‌గా నిలవగా.. రశ్మి దేశాయ్, శమితా శెట్టి టాప్ కంటెస్టెంట్లుగా నిలిచి తమ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసుకున్నారు.

ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతుండటంతో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న త‌దుప‌రి సీజ‌న్ (బిగ్ బాస్ 20)లో పాల్గొనబోతోందనే వార్తలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ యాజమాన్యం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్నవారిని లేదా పర్సనల్‌గా స్ట్రాంగ్ లైఫ్ స్టోరీ ఉన్నవారిని ఎంచుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం.

Tags:    

Similar News