ఓటీటీ లో క్రేజ్.. థియేటర్లలో మాత్రం ఎందుకీ తేడా?
మలయాళ సినిమా అంటే మంచి కథ, సహజమైన నటన, వైవిధ్యమైన కథనానికి మరో పేరు.
మలయాళ సినిమా అంటే మంచి కథ, సహజమైన నటన, వైవిధ్యమైన కథనానికి మరో పేరు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విస్తరించిన తర్వాత మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఏర్పడింది. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే ఆదరించే పరిస్థితి వచ్చింది. అయితే ఇదే ఆదరణ థియేటర్లలో మాత్రం ప్రతిసారి కనిపించకపోవడం ఇప్పుడు ఆసక్తికరమైన డిస్కషన్‌కు దారితీస్తోంది.
తెలుగు ఆడియన్స్ లో మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పలేం. గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు మంచి ఆదరణ పొందాయి. అయితే థియేటర్‌లో ఒక సినిమా చూడాలంటే కేవలం కథ బాగుంటే సరిపోదనే పరిస్థితి క్రమంగా పెరిగింది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్‌పై ఆడియన్స్ ను థియేటర్‌కు రప్పించేందుకు స్టార్ ఇమేజ్, భారీ విజువల్స్, యాక్షన్, మ్యూజిక్ అంశాలు కీలకంగా మారుతున్నాయి.
ఓటీటీ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆడియన్స్ తమకు తనకు నచ్చిన టైమ్‌లో, ఇంట్లోనే సినిమా చూడొచ్చు. సినిమా బాగుందనే మౌత్ టాక్ వస్తే కొన్ని వారాల తర్వాతైనా దాన్ని చూసే అవకాశం ఉంటుంది. భాష కూడా పెద్ద అడ్డంకిగా ఉండదు. సబ్‌టైటిల్స్, డబ్బింగ్ అందుబాటులో ఉండటంతో కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. అందుకే మలయాళంలో వచ్చిన చిన్న, ప్రయోగాత్మక, సంబంధాల ఆధారిత కథలు కూడా ఓటీటీలో మంచి రీచ్ ను సాధిస్తున్నాయి.
థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ డెసిషన్ మాత్రం మరింత కఠినంగా ఉంటుంది. టికెట్ ధర, జర్నీ, పార్కింగ్, టైమ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆడియన్స్, ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలా? అనే ప్రశ్న వేసుకుంటున్నారు. అందుకే స్టార్ హీరోల సినిమాలు లేదా భారీ కాన్వాస్ ఉన్న సినిమాలకు థియేట్రికల్ అడ్వాంటేజ్ లభిస్తోంది. ఇదే సమయంలో మలయాళ కంటెంట్‌కు మరో ఛాలెంజ్ డబ్బింగ్ సినిమా అనే ముద్ర. ఒరిజినల్ భాషలో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నా, తెలుగు వెర్షన్‌కు కొత్తగా ఆడియన్స్ ను థియేటర్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరుస పెద్ద సినిమాలు పోటీగా ఉన్నప్పుడు ఈ పని మరింత కష్టమవుతుంది.
అయితే కంటెంట్‌కు పూర్తిగా మార్కెట్ లేదని కూడా చెప్పలేం. సరైన ప్రమోషన్, ఎట్రాక్టివ్ టైటిల్, తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే మార్కెటింగ్, స్ట్రాంగ్ మౌత్ టాక్ ఉంటే చిన్న సినిమా కూడా అనూహ్యమైన ఫలితాన్ని అందుకోవచ్చు. మొత్తానికి ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణను థియేట్రికల్ విజయంగా మార్చాలంటే కంటెంట్‌తో పాటు థియేటర్‌లోనే చూడాలి అనే కారణాన్ని కూడా ప్రేక్షకుడికి అందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మలయాళంలో మంచి సక్సెస్ ను అందుకున్న బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.