'రాకా'కి ముందు.. మరో పాట

‘రాధిమా’లో భాగ్యశ్రీ బోర్సే కనిపించడం కూడా పాటకు మరింత క్రేజ్ తెచ్చింది. తెలుగులో ఇప్పటికే పరిచయం ఉన్న హీరోయిన్ కావడంతో వీడియోకు వెంటనే ఫేస్ వాల్యూ వచ్చింది.

Update: 2026-08-25 05:07 GMT

సాయి అభ్యంకర్ ఇప్పుడు ఒకే దారిలో వెళ్లడం లేదు. ఒకవైపు సినిమాలకు సంగీతం చేస్తూ బిజీ అవుతున్నాడు. మరోవైపు తనకు మొదట పెద్ద గుర్తింపు తెచ్చిన ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను కూడా వదలడం లేదు. ‘రాకా’ మీద ఫోకస్ పెరుగుతున్న సమయంలోనే ఇప్పుడు ‘రాధిమా’ అనే కొత్త మ్యూజిక్ వీడియోతో వచ్చాడు. ఇది జస్ట్ మరో పాట రిలీజ్ అన్న దానికంటే, సాయి తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూపించే పాయింట్.

‘కచ్చి సేరా’, ‘ఆస కూడ’ పాటలు సాయి పేరు ఒక్కసారిగా హై లెవెల్ కు తీసుకెళ్లాయి. అవి ఏ సినిమా పాటలు కావు. హీరో, దర్శకుడు, పెద్ద బ్యానర్ సపోర్ట్ లేకుండానే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా యూత్‌లో అతనికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తర్వాత సినిమా ఆఫర్లు పెరిగినా, తాను వచ్చిన రూట్‌ను పూర్తిగా వదిలేయకుండా మధ్య మధ్యలో సింగిల్స్ చేయడం కొనసాగిస్తున్నాడు.

‘రాధిమా’లో భాగ్యశ్రీ బోర్సే కనిపించడం కూడా పాటకు మరింత క్రేజ్ తెచ్చింది. తెలుగులో ఇప్పటికే పరిచయం ఉన్న హీరోయిన్ కావడంతో వీడియోకు వెంటనే ఫేస్ వాల్యూ వచ్చింది. సాయి కూడా స్క్రీన్‌పై కనిపిస్తూ పాటను పూర్తి విజువల్ ప్రాజెక్ట్‌లా తీసుకొచ్చాడు. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్లు కెమెరా వెనుకే ఉండకుండా తమ పాటల్లో తామే కనిపించడం ట్రెండ్ అవుతోంది. సాయి దగ్గర అది మొదటి నుంచే ఒక స్టైల్‌గా మారింది.

ఇక ‘రాకా’ కారణంగా సాయి మీద ఇప్పుడు సినిమా మ్యూజిక్ వైపు కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. పెద్ద ప్రాజెక్ట్‌లో తన సౌండ్ ఎలా ఉంటుంది, కమర్షియల్ సినిమా అవసరాలకు తగ్గట్టు ఎలా మారతాడు అన్నది చూడాల్సి ఉంది. ఇండిపెండెంట్ పాటల్లో తనకు పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది. కానీ సినిమాలో కథ, హీరో ఇమేజ్, దర్శకుడి టేస్ట్ అన్నీ కలవాలి. అక్కడే సాయి మరో రకమైన పరీక్ష ఎదుర్కొంటాడు.

అందుకే ‘రాధిమా’లాంటి పాటలు అతనికి ఉపయోగపడతాయి. సినిమా ఆల్బమ్ కోసం నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా తన మ్యూజిక్‌ను డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలడు. పాట హిట్ అయితే ఆ క్రెడిట్ కూడా డైరెక్ట్ గా అతని పేరుకే వస్తుంది. పైగా కొత్త సౌండ్ ట్రై చేయడానికి కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్‌లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. ‘రాకా’ రిలీజ్ అయ్యేలోపు సాయి పేరు సినిమాల వల్ల మాత్రమే వినిపించాల్సిన అవసరం లేదు. మధ్యలో ఇలాంటి పాటలు వస్తూ ఉంటే అతని మ్యూజిక్ బ్రాండ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక రాకా ఫస్ట్ సింగిల్ వస్తె ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.




Tags:    

Similar News