దురంధర్ పాపకు ఇది పెద్ద టాస్కే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా అర్జున్ ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేసింది.

Update: 2026-08-25 06:40 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా అర్జున్ ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు హీరోయిన్‌గా ఎదగడం ఇండస్ట్రీలో చాలా కష్టమైన టాస్క్. చాలామందికి ఈ ట్రాన్సిషన్ దగ్గరే కెరీర్ స్లో అవుతుంది. కానీ సారా విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. ప్రస్తుతం ఆమె లైనప్ చూస్తుంటే కమర్షియల్ హీరోయిన్‌గా తనకంటూ ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేసుకునేలా కనిపిస్తోంది.

సారా కెరీర్ స్పీడ్ గా మారడానికి కారణం దురంధర్ సినిమా. ఆ ప్రాజెక్ట్‌లో ఆమె కనిపించిన తీరు జనాలకు బాగా కనెక్ట్ అయింది. అప్పటివరకు చిన్న పాత్రల్లో సారాను చూసిన ప్రేక్షకులు, ఆ సినిమాతో ఆమెను పరిణితి చెందిన నటిగా యాక్సెప్ట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో సారాకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. హీరోయిన్ పాత్రల వైపు వెళ్తున్న కరెక్ట్ టైమ్‌లో ఇలాంటి హిట్ పడటం ఆమెకు ప్లస్ అయింది.

దురంధర్ ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు సారా తెలుగులో మ్యాజిక్ సినిమా చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. కథను తన భుజాల మీద వేసుకుని స్క్రీన్ మీద ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా ఆమె ఎంతవరకు మెప్పిస్తుంది అనేది ఈ సినిమా రిజల్ట్ తో క్లియర్ అవుతుంది.

ఈ సినిమాల లైనప్ ఒక ఎత్తు అయితే, సారా చేతికి వచ్చిన మరో ఆఫర్ గురించి ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తోంది. దిగ్గజ నటి మధుబాల బయోపిక్ లో నటించే ఛాన్స్ సారాకు దక్కింది. ప్రొడ్యూసర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహించనున్నారు. ఒక మామూలు హీరోయిన్ పాత్ర చేయడం వేరు, మధుబాల లాంటి లెజెండరీ యాక్ట్రెస్ ను తెరమీద బతికించడం వేరు.

మ్యాజిక్ సినిమాలో ఇప్పటి జనరేషన్ అమ్మాయిగా కనిపిస్తున్న సారా, ఈ బయోపిక్ కోసం పూర్తిగా పాత కాలం నాటి వాతావరణంలోకి వెళ్లాలి. ఆనాటి నటీమణుల లుక్, హావభావాలు, నడిచే తీరు పర్ఫెక్ట్‌గా పట్టుకోవాలి. జనాలకు తెలిసిన మొహాన్ని తెరమీద ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కచ్చితంగా పోలికలు వస్తాయి. వాటిని తట్టుకుని నటనతో మెప్పించడం అనేది ఈ వయసులో సారాకు ఒక పెద్ద సవాల్ లాంటిదే.

సారా దగ్గర ఇప్పుడు అసలు ప్లస్ వయసు. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ అనుభవం, ఆ తరువాత పాన్ ఇండియా గుర్తింపు, హీరోయిన్ ఛాన్స్, బయోపిక్ లాంటి బరువైన పాత్ర అన్నీ ఒకేసారి వచ్చాయి. ఈ దశలో రెండు మూడు కథలు సరిగ్గా ఎంచుకుంటే చాలా త్వరగా పెద్ద హీరోయిన్ల లీగ్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ స్పీడ్ అంతే త్వరగా తగ్గిపోవచ్చు. అందుకే ఇప్పుడు ఆమె నెక్స్ట్ సెలక్షన్స్ చాలా కీలకం.

Tags:    

Similar News