బిగ్‌బాస్‌ కోసం మైక్‌ టైసన్‌.. సాధ్యమేనా?

మైక్‌ టైసన్‌ గతంలో చాలా ఇండియన్‌ షో ల్లో కనిపించారు. ఇండియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. లక్షల్లో అభిమానులు ఉంటారు.;

Update: 2025-08-22 06:05 GMT

ఇండియాలో బిగ్‌బాస్‌ షో కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హిందీ బిగ్‌బాస్‌ షో ప్రేక్షకులకు ఒక వ్యసనం మాదిరిగా మారింది. ప్రతి ఏడాది ఒక సీజన్‌ రాకుంటే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రతి సీజన్‌కి సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ చేస్తూ వస్తున్నాడు. ఆయన తన ఫీజ్‌ ను ప్రతి సీజన్‌కి పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నప్పటికీ నిర్వాహకులు మాత్రం ఆయన్నే హోస్ట్‌గా షో చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు హిందీ బిగ్‌ బాస్‌ 18 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అతి త్వరలో 19వ సీజన్‌ ప్రారంభం కాబోతుంది. ప్రతి సీజన్‌ను కొత్తగా, ప్రేక్షకులను అలరించే విధంగా నిర్వహించేందుకు గాను నిర్వాహకులు చాలా గట్టి కసరత్తు చేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్ట్‌గా సల్మాన్ ఖాన్‌ వ్యవహరించబోతుండగా, సర్‌ప్రైజింగ్‌ గెస్ట్‌లు చాలా మంది ఉంటారని, కంటెస్టెంట్స్‌ ప్రముఖులు ఉంటారనే వార్తలు వస్తున్నాయి.

హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 19

బిగ్‌బాస్ నిర్వాహకులు 19వ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే విధంగా మైక్‌ టైసన్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్‌ మాజీ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అయిన మైక్‌ టైసన్‌ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ అనే విషయం తెల్సిందే. ఐరన్‌ మైక్‌ అని, కిడ్‌ డైనమైట్‌ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే మైక్‌ టైసన్‌ ఈ మధ్య కాలంలో టీవీ షోల్లో కనిపించేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. అందుకే ఇండియన్ బిగ్‌బాస్‌ షో లో వారం లేదా రెండు వారాల పాటు పాల్గొనేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ వంటి షో లో ఉండటానికి మైక్‌ టైసన్ ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన పారితోషికం కూడా అత్యంత భారీగా ఉంటుంది. అయినా నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారంటే హిందీ బిగ్‌బాస్ ఈసారి గట్టిగానే ఉండే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో మైక్‌ టైసన్‌

మైక్‌ టైసన్‌ గతంలో చాలా ఇండియన్‌ షో ల్లో కనిపించారు. ఇండియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. లక్షల్లో అభిమానులు ఉంటారు. అలాంటి మైక్‌ టైసన్‌ను విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ సినిమాలో పూరి జగన్నాధ్‌ నటింపజేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో టైసన్‌ను జోకర్‌గా చూపించారు అంటూ కొందరు విమర్శలు చేశారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ ఇండియాలో ఆయన అడుగు పెట్టేందుకు రెడీగా ఉన్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు ఆయన టీంతో సంప్రదింపులు మొదలు పెట్టింది. వరల్డ్‌ రికార్డ్‌లు సాధించిన మైక్‌ టైసన్‌ను హిందీ బిగ్‌బాస్‌లోకి తీసుకు రావడం వల్ల సీజన్‌ ప్రారంభంకు ముందే హిట్‌ అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. షో ప్రారంభంకు ముందు, గ్రాండ్‌ ఫినాలేకు మైక్‌ టైసన్‌ వస్తే ఖచ్చితంగా గత సీజన్‌లు అన్నింటి కంటే సూపర్‌ హిట్‌ అవ్వడం ఖాయం.

నాగార్జున హోస్ట్‌గా తెలుగు బిగ్‌బాస్‌

59 ఏళ్ల మైక్‌ టైసన్ ఇప్పటికీ చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే బాక్సింగ్‌ కాంపిటీషన్స్‌కి ముఖ్య అతిథిగా వెళ్లడంతో పాటు, అక్కడి ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించే విధంగా సరదాగా టైసన్ మాట్లాడటం చూస్తూ ఉంటాం. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా టైసన్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాంటి మోస్ట్‌ వాంటెడ్‌ సెలబ్రిటీ అయిన మైక్‌ టైసన్‌ కనుక బిగ్‌ బాస్‌ సీజన్‌ 19 లో కనిపిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా మొత్తం సీజన్‌కి బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. తెలుగు బిగ్‌ బాస్‌ కొత్త సీజన్‌ సైతం వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లోనూ ప్రముఖ సెలబ్రిటీలు కనిపించబోతున్నారు. అంతే కాకుండా ఈసారి సామాన్యులు ఎక్కువ మందికి అవకాశం దక్కబోతుందని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు.

Tags:    

Similar News