మేటి న‌టి న‌ర్త‌కి అభిన‌య‌నేత్రికి అరుదైన రుగ్మ‌త‌?

మంచు మోహ‌న్ బాబు స‌ర‌స‌న `పెద‌రాయుడు` చిత్రంలో భానుప్రియ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌ను తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.;

Update: 2025-12-05 04:33 GMT

ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో అగ్ర క‌థానాయిక‌గా ఏలి, బాలీవుడ్ లోను దిగ్గ‌జ స్టార్ల‌తో న‌టించిన మేటి న‌టి, న‌ర్త‌కి భానుప్రియ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 1983లో మెల్ల పెసుంగల్ అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన భానుప్రియ‌ చాలా తక్కువ వ్యవధిలో తమిళ, తెలుగు పరిశ్రమలలో తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకుంది. దశాబ్దాల క్రమశిక్షణతో కూడిన శాస్త్రీయ నృత్య శిక్షణ భానుప్రియ‌ను న‌టిగా న‌ర్త‌కిగా నిల‌బెట్టింది. క‌ళ్ల‌తోనే కోటిభావాలు ప‌లికించ‌డం ఎలానో భానుప్రియ‌నే అడ‌గాలి అనేంత‌గా పాపుల‌ర‌య్యారు.

1983 నుంచి 1995 వ‌ర‌కూ న‌ట‌నారంగంలో అభిన‌య‌నేత్రిగా హృద‌యాల‌ను గెలుచుకున్నారు భాను ప్రియ‌. మెగాస్టార్ చిరంజీవి, ర‌జ‌నీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, వెంక‌టేష్, బాల‌కృష్ణ, భాగ్య‌రాజ్ స‌హా ఎంద‌రో దిగ్గ‌జ క‌థానాయ‌కుల స‌ర‌స‌న భాను ప్రియ న‌టించారు.

మంచు మోహ‌న్ బాబు స‌ర‌స‌న `పెద‌రాయుడు` చిత్రంలో భానుప్రియ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌ను తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. స‌హాయ‌న‌టిగా చాలా సినిమాల‌లో న‌టించిన భానుప్రియ ఇటీవ‌ల పెద్ద తెర‌కు దూరంగా ఉన్నారు. కెరీర్ లో మూడు ఆంధ్ర‌ రాష్ట్ర నంది అవార్డులు, రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు , రెండు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు .. ఇంకా ఎన్నో పుర‌స్కారాల‌ను భానుప్రియ‌ అందుకున్నారు. అయితే న‌టిగా ఒక గొప్ప వెలుగు వెలిగిన భానుప్రియ వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం ఆశించిన విధంగా సాగ‌లేదు.

హిందీ చిత్ర‌సీమ‌లో జీతేంద్ర, ధర్మేంద్ర, రాజ్ కుమార్, వినోద్ ఖన్నా, మిథున్ చక్రవర్తి వంటి పెద్ద స్టార్ల‌తో భానుప్రియ న‌టించింది. మ‌ణిర‌త్నం ద‌ళ‌ప‌తిలో, కె. బాలచందర్ - అజగన్‌లో మమ్ముట్టితో క‌లిసి న‌టించింది. మోహన్‌లాల్‌తో కలిసి పీరియాడిక్ డ్రామా రాజశిల్పిలో న‌టించింది. ఇది మలయాళ సినిమాల్లో ఆరంగేట్రం.

అది అళకియ రావణన్, హైవే, పెదరాయుడు, మహారాసన్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది.

భానుప్రియ 1998లో ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ ని పెళ్లాడారు. పెళ్లి త‌ర్వాతా 2000ల వరకు అప్పుడప్పుడు నటించడం కొనసాగించింది. లాహిరి లాహిరి లాహిరిలో, నైనా, కదంబ వంటి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది. అయితే భ‌ర్త‌ ఆదర్శ్ 2018లో మరణించడం త‌న జీవితంలో పెద్ద కుదుపు. వారి కుమార్తె అభినయకు తండ్రి లేని ప‌రిస్థితి ఎదురైంది.

భానుప్రియ ఇటీవ‌ల జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధ స‌మ‌స్య‌(అల్జీమ‌ర్స్‌)ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. చివ‌ర‌కు తాను నేర్చుకున్న శాస్త్రీయ నృత్యం, క‌ళారూప‌కాల‌ను కూడా మ‌ర్చిపోయేంత‌గా ప‌రిస్థితి దిగ‌జారింద‌ని ఆమె అంగీక‌రించడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. షూటింగ్ సమయంలో అడుగులు, కదలికలు, పంక్తులను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయిన ప‌రిస్థితి త‌లెత్తింది. 2022లో సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్ షూటింగ్ సమయంలో భానుప్రియ సెట్లో స్తంభించిపోయింది. కెమెరా ముందు డైలాగులు చెప్ప‌లేక‌పోయారు. సంభాషణలను గుర్తుంచుకోలేకపోయాన‌ని కూడా ఇంట‌ర్వ్యూలో తెలిపారు. భానుప్రియ చాలా స‌మ‌స్య‌ల‌తో మాన‌సిక ప‌ర‌మైన ఒత్తిళ్ల‌ను ఎదుర్కొన్నారు.

Tags:    

Similar News