ప్రతి సినిమా ముందు హైప్.. రిలీజ్ తర్వాత షాక్! ఇప్పుడైనా ఫేట్ మారుతుందా?
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మడికి సక్సెస్‌లు లేకపోయినా భాగ్యశ్రీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమెపై నమ్మకం ఉంచుతున్నారు.
ఇండస్ట్రీలోకి ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ సక్సెస్‌లు మాత్రం దూరంగా ఉండే హీరోయిన్లు కూడా ఉంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. కెరీర్ ప్రారంభం నుంచి ఆమెకు అవకాశాల పరంగా అయితే కొరత లేదు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగమయ్యే ఛాన్స్ కూడా దక్కింది. అయితే అదృష్టం మాత్రం ఆమెకు పూర్తిగా సహకరించలేదు. అందుకే సినీ వర్గాల్లో ఇప్పుడు భాగ్యశ్రీ కెరీర్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొనడం, రిలీజ్ తర్వాత ఆశించిన ఫలితం రాకపోవడం ఆమె ప్రయాణంలో కామన్‌గా మారిపోయింది.
భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌ను పరిశీలిస్తే ఆమె టాలెంట్‌కు ఎప్పుడూ ప్రశంసలే వచ్చాయి. రవితేజ సరసన చేసిన మిస్టర్ బచ్చన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఆ సినిమాలో తన గ్లామర్‌తో పాటూ నటనతో కూడా ఆకట్టుకుంది. కానీ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కింగ్‌డమ్ పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు గుర్తింపు తీసుకొస్తుందని భావించింది కానీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. ఇక ఆంధ్రకింగ్ తాలూకాకు పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. అలాగే దుల్కర్ సల్మాన్‌తో చేసిన కాంత కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హిందీలో క్యామియో చేసిన యారియాన్2, చందూ ఛాంపియన్ సినిమాలు కూడా ఓ మోస్తరు ఫలితాలనే అందుకున్నాయి. ఇలా చూసుకుంటే ప్రతి ప్రాజెక్ట్ ఆమెకు కొత్త ఆశను ఇచ్చినా, ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చిందనే అభిప్రాయం బలపడుతోంది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మడికి సక్సెస్‌లు లేకపోయినా భాగ్యశ్రీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమెపై నమ్మకం ఉంచుతున్నారు. అందుకే ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న లెనిన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అఖిల్ పాత్రలో వచ్చే భావోద్వేగ మార్పులు, యాక్షన్‌కు దారితీసే సంఘటనల వెనుక భాగ్యశ్రీ పాత్రే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ లెనిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధిస్తే అది అఖిల్ కెరీర్‌కే కాకుండా భాగ్యశ్రీ కెరీర్‌కు కూడా పెద్ద మలుపు కావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లెనిన్ పై భాగ్యశ్రీ చాలానే ఆశలు పెట్టుకుంది.
ఇక టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌పై కూడా భాగ్యశ్రీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తమిళ సినిమా సియోన్‌పై కోలీవుడ్‌లో సానుకూల చర్చ నడుస్తోంది. ఈ సినిమా కూడా మంచి రిజల్ట్ అందుకుంటే దక్షిణాది సినీ పరిశ్రమలో ఆమె స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు లెనిన్, సియోన్ సినిమాలను భాగ్యశ్రీ కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులుగా చూస్తున్నారు. టాలెంట్ ఉన్నా హిట్లు రాని హీరోయిన్‌గా గుర్తింపు పొందిన భాగ్యశ్రీ బోర్సేకు ఈ రెండు సినిమాలు అదృష్ట ద్వారాలు తెరుస్తాయా? లేక మరోసారి నిరాశే మిగులుతుందా? అనే ప్రశ్నకు సమాధానం వచ్చే కొన్ని నెలల్లోనే దొరకనుంది.