బెల్లంకొండ నెక్స్ట్.. ఇదేదో గట్టి ప్లానే..

గత ఏడాది ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు సాయి శ్రీనివాస్.

Update: 2024-04-27 01:30 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. కెరీర్ స్టార్టింగ్ లో మాస్ సినిమాలతో సందడి చేశారు. మొదటి మూవీ అల్లుడు శీనుతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత స్పీడున్నోడు, సాక్ష్యం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి పలు చిత్రాలు చేశారు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌ టాక్ అందుకున్నాయి.

గత ఏడాది ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు సాయి శ్రీనివాస్. ప్రస్తుతం సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్రతో టైసన్ నాయుడు సినిమా చేస్తున్నారు శ్రీనివాస్. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చావు కబురు చల్లగా డైరెక్టర్ తో కిష్కింద పురి మూవీలో కూడా నటిస్తున్నారు శ్రీనివాస్.

అయితే ఇప్పుడు మరో సినిమాను సాయి శ్రీనివాస్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషియో ఫాంట‌సీ జోనర్ లో అడ్వంచర్ థ్రిల్లర్ గా ఆ మూవీ తెరకెక్కనుందని టాక్ నడుస్తోంది. లుధీర్ బైరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారట. ఈ చిత్రం రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. చాలా నెలల క్రితం శ్రీనివాస్.. ఈ కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌, మూన్‌ షైన్ పిక్చర్స్‌ సంస్థలతో చెరో ఒక మూవీ చేయనున్నానని శ్రీనివాస్ ప్రకటించారు. లుధీర్ బైరెడ్డితో శ్రీనివాస్ చేయనున్న మూవీ ఈ రెండు బ్యానర్లలో ఏదో ఒకటి రూపొందించనుందని టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగనున్నారని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లుధీర్ కు ఇదే ఫస్ట్ మూవీ అయినప్పటికీ.. బెల్లంకొండ ఆయన చేతిలో రూ.50 కోట్ల ప్రాజెక్టు పెట్టడంతో అంతా షాకవుతున్నారు. దీని బట్టి చూస్తే కథపై శ్రీనివాస్ బాగా నమ్మకంతో ఉన్నట్లు అర్థమవుతోంది. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News