బెల్లంకొండ.. 'హైందవ'తో మరో పవర్ఫుల్ లుక్!
ఇదిలా ఉంటే, బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.;
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక సపరేట్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో 'ఛత్రపతి' హిందీ రీమేక్ కోసం టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన బెల్లంకొండ, 2025లో మాత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదే రెండు సినిమాలతో పలకరించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు.
2025 మే నెలలో వచ్చిన 'భైరవం' కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్నా, నటుడిగా బెల్లంకొండకు మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే వచ్చిన హారర్ కామెడీ 'కిష్కింధపురి' మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి, బెల్లంకొండకు చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ సక్సెస్ ను అందించింది. దీంతో ఇప్పుడు ఆయన లైనప్ పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది.
అయితే హ్యాట్రిక్ కొడతాడు అనుకున్న టైమ్ లో 'టైసన్ నాయుడు' సినిమా కాస్త డిలే అయ్యింది. ఈ సినిమాను 2026 సమ్మర్ రేస్ లో దించే ప్లాన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే, బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'హైందవ' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. పోస్టర్ డిజైన్, టైటిల్ ఫాంట్ చూస్తుంటేనే ఇదొక మిస్టరీ యాక్షన్ సినిమా అని అర్థమవుతోంది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుధీర్ బైరెడ్డి నిర్మిస్తుండగా.. మహేష్ చందు దర్శకత్వం వహిస్తున్నారు.
రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. హీరో వెనకాల దశావతారాల్లో ఒకటైన వరాహ రూపం ఉగ్రంగా కనిపిస్తుండటం. హీరో చేతిలో కాగడా, గొడ్డలి పట్టుకుని నీటిలో ఉన్న ఒక పురాతన స్తంభంపై నిల్చొని ఉండటం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. క్యాప్షన్ లో "సత్యాన్వేషణలో అతను ఒంటరి కాదు.. దశావతారాలు అతనికి అండగా ఉంటాయి" అని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ మధ్య కాలంలో 'కాంతార', 'హనుమాన్', 'కార్తికేయ 2' లాంటి దైవ సంబంధిత కథలకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు బెల్లంకొండ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ, డివైన్ టచ్ ఉన్న యాక్షన్ కథను ఎంచుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. 'శ్యామ్ సి ఎస్' సంగీతం అందిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.