3 ఏళ్ల గ్యాప్ తర్వాత గణేష్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.;
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సెన్సిటివ్ లవ్ స్టోరీలతో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వం వహించనున్నారు. ఏప్రిల్ 13న ఈ కొత్త సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం.
స్టార్‌డమ్ ను అందుకోలేకపోయిన గణేష్
నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా, స్టార్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా గణేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి సపోర్ట్, గుర్తింపు ఉన్నప్పటికీ, గణేష్ ఇప్పటివరకు భారీ స్టార్‌డమ్‌ను సంపాదించలేకపోయాడు. కానీ గణేష్ యాక్టింగ్ లో మాత్రం తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మూడేళ్ల నుంచి ఎలాంటి సినిమానీ అనౌన్స్ చేయని గణేష్
గణేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమవుతున్నా అతను ఎక్కువ సినిమాలేమీ చేయలేదు. గణేష్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా నేను స్టూడెంట్ సర్. ఈ సినిమా 2023లో రిలీజైంది. ఆ సినిమా తర్వాత అతన్నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ అవలేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా మంచి కథ కోసం వేచి చూసిన గణేష్, ఈసారి మాత్రం బలమైన కథతోనే రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరుణాకరన్ చెప్పిన కథ అతనికి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న కరుణాకరన్
ఇక డైరెక్టర్ కరుణాకరన్ విషయానికొస్తే , ఆయన తన కెరీర్లో ఎన్నో సాఫ్ట్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో ఆయన సినిమాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే, ఆయన నుంచి చివరిసారిగా వచ్చిన సినిమా తేజ్ ఐ లవ్ యు తర్వాత ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గణేష్‌తో చేస్తున్న ఈ సినిమా ఆయనకు కూడా ఒక ముఖ్యమైన కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.
ఈ కొత్త సినిమా కథ, జానర్, హీరోయిన్ లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరుణాకరన్ స్టైల్‌ను బట్టి చూస్తే, ఇందులో బలమైన ఎమోషన్స్‌తో పాటు రొమాంటిక్ ట్రాక్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గణేష్ కెరీర్‌కు ఇది కీలకమైన మలుపు కావొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, గణేష్ మరియు కరుణాకరన్ ఇద్దరికీ ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. ఒకరు స్టార్‌డమ్ కోసం ఎదురుచూస్తుంటే, మరొకరు సక్సెస్‌ఫుల్ రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.