బండ్ల‌న్న చెప్పింది అక్ష‌ర స‌త్యం

ప‌వ‌న్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గ‌ణేష్ స్పీచ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌. అంత‌గా అభిమానుల‌తో పాటు స‌గ‌టు సినీ ల‌వ‌ర్‌ని బండ్ల గ‌ణేష్ స్పీచ్ ఆక‌ట్టుకునేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.;

Update: 2025-06-02 06:34 GMT

ప‌వ‌న్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గ‌ణేష్ స్పీచ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌. అంత‌గా అభిమానుల‌తో పాటు స‌గ‌టు సినీ ల‌వ‌ర్‌ని బండ్ల గ‌ణేష్ స్పీచ్ ఆక‌ట్టుకునేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఈ మ‌ధ్య బండ్ల‌న్న సినిమాలు చేయ‌డం త‌గ్గిపోవ‌డంతో అభిమానుల ఆయ‌న స్పీచ్‌ని మిస్స‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు ఎస్వీకృష్ణారెడ్డి బ‌ర్త్‌డే వేడుక‌ల్లో బండ్ల గ‌ణేష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారి అంద‌రిని ఆలోచింప‌జేస్తోంది.

నేటి ద‌ర్శ‌కులు, హీరోల వ‌ర్కింగ్ స్టైల్ పై చుర‌క‌లు అంటించిన బండ్ల గ‌ణేష్ స్టార్ డైరెక్ట‌ర్స్‌, స్టార్ హీరోలపై సెటైర్లు వేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు నాలుగేళ్ల‌కు ఒక సినిమా చేయ‌డం ఏంట‌ని ఎద్దేవా చేశారు. అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి `వినోదం` సినిమాను కేవ‌లం ఎన‌భై నుంచి తొంబై రోజుల్లో పూర్తి చేసి విడుద‌ల చేశార‌ని, అలా ఓ సినిమాని త‌క్కువ రోజుల్లో పూర్తి చేసి రిలీజ్ చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు.

ఇటీవ‌ల స్టార్ హీరోలు నాలుగేళ్ల‌కో సినిమా చేయ‌డం వ‌ల్ల థియేట‌ర్లు న‌ష్టాల బారిన ప‌డుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న స్వంత థియేట‌ర్‌కు వెళ్లి బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటే రూ.40 ల‌క్ష‌లు న‌ష్టం తేలింద‌ని, ఇది కేవ‌లం మంచి సినిమాలు రిలీజ్ కాక‌పోవ‌డం, డైరెక్ట‌ర్లు సినిమాల విష‌యంలో వేగం త‌గ్గించ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితి ఎదురుర‌వుతోంద‌ని బండ్ల‌న్న పంచ్ లేశారు. అయితే బండ్ల గ‌ణేష్ స్పీచ్‌పై కొంత మంది గుర్రుగా ఉన్నా ఆయ‌న మాట్లాడింది మాత్రం అక్ష‌ర స‌త్యం.

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌తి స్టార్ పాన్ ఇండియా మూవీ అంటూ లెక్క‌లు వేస్తున్నారు. కొంత మంది నిర్మాత‌లు కూడా హీరోల‌కు త‌గ్గ‌ట్టే పాన్ ఇండియా సినిమాల‌కు సై అంటున్నారు. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తూ ద‌ర్శ‌కుల‌కు నిర్మాత‌లు ఫ్రీడం ఇచ్చేస్తున్నారు. దీంతో స్టార్ డైరెక్ట‌ర్లు అమ‌ర శిల్పి జ‌క్క‌న్న‌లుగా మారి ఏళ్ల‌కు ఏళ్లు సినిమాల‌ని చెక్కేస్తూ థియేట‌ర్లు బోసిపోయేలా చేస్తున్నారు. దీంతో థియేట‌ర్ వ్య‌వ‌స్థ ప‌త‌న ద‌శ‌కు చేరుకుంటూ సినీ ఇండ‌స్ట్రీ ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కంగా మారుస్తోంది.

స‌క్సెస్ రేటు ప‌ది శాతానికి ప‌డిపోయిన నేప‌థ్యంలో మ‌న ద‌ర్శ‌క‌, హీరోల్లో మార్పులు రావాల్సిన అవ‌సరం ఎంతో ఉంది. ఏళ్ల‌కు ఏళ్లు స్టార్ హీరో సినిమా కోసం థియేట‌ర్లు ఎదురు చూసే ప‌రిస్థితులు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో ఇక‌నైనా ఆ గ్యాప్ రానివ్వ‌కుండా హీరోలు, ద‌ర్శ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రిస్థితులు మారుతాయ‌ని, త ద్వారా ఎంతో మందికి ప‌ని ల‌భిస్తుంద‌ని ప‌లువురు కామెంట్‌లు చేస్తున్నారు. త‌మ గురించే ఆలోచించడం కాకుండా ప‌రిశ్ర‌మ గురించి, దాని మ‌నుగ‌డ గురించి హీరోలు, ద‌ర్శ‌కులు ఆలోచించి రెండు మూడేళ్ల‌కు ఒక సినిమా కాకుండా ఏడాదికి నాలుగు భారీ సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేలా త‌మ కార్య‌చ‌ర‌ణ‌ను మార్చుకుంటే మంచిద‌ని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News