ఆస్తుల వేలం.. బండ్ల గణేష్‌ కు షాక్ తగిలినట్లేనా..

మరోవైపు, దివాళా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వేలం నిర్వహించడం కరెక్ట్ కాదని బండ్ల గణేష్ తరఫున వాదనలు వినిపించాయి.

Update: 2026-07-04 06:47 GMT

ఆస్తుల వేలం వ్యవహారంతో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పుతో ఆ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. యూనియన్ బ్యాంక్ నిర్వహించిన ఆస్తి వేలం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేస్తూ, గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఇచ్చిన ఆర్డర్స్ ను రద్దు చేసింది. దీంతో బ్యాంక్ రికవరీ ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లే.

వాస్తవానికి ఆ వివాదం శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకున్న లోన్లకు సంబంధించినది. ఆ సంస్థలో బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా ఉన్నారు. వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న సమయంలో, జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌ పేట్‌ లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని తాకట్టు పెట్టారు. ఆ లోన్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ పర్సనల్ ప్రామిసర్లుగా కూడా ఉన్నారు.

అనుకున్న టైమ్ లో లోన్లు చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద చర్యలు చేపట్టింది. 2019లో తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని, 2022లో బహిరంగంగా వేలం నిర్వహించింది. ఆ వేలంలో ఆస్తి రూ.8.51 కోట్లకు అమ్ముడైంది. అయితే ఆ వేలాన్ని బండ్ల గణేష్ కుటుంబం సవాల్ చేయగా, డీఆర్‌ టీ గతంలో వేలాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత డీఆర్‌ టీ నిర్ణయాన్ని యూనియన్ బ్యాంక్ హైకోర్టులో సవాల్ చేసింది. విచారణ సందర్భంగా బ్యాంకు తరఫున న్యాయవాదులు రుణ వసూళ్ల ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని, వేలం కూడా నిబంధనల ప్రకారమే నిర్వహించామని వాదించారు. అలాగే వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒకేసారి రుణ పరిష్కార పథకం (ఓటీఎస్)లో సర్దుబాటు చేసే అంశంపై కూడా అంగీకారం ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు, దివాళా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వేలం నిర్వహించడం కరెక్ట్ కాదని బండ్ల గణేష్ తరఫున వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. వేలానికి వెళ్లిన ఆస్తి కంపెనీకి చెందినది కాదని, పర్సనల్ ప్రామిసర్స్ ఆస్తి అని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల దివాలా చట్టంలోని పరిమితులు ఈ ఆస్తికి వర్తించవని పేర్కొంది. జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బ్యాంకు వాదనలతో అగ్రీ అయింది.

డీఆర్‌టీ ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తూ, బ్యాంకు నిర్వహించిన వేలం చట్ట ప్రకారం జరిగిందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బ్యాంక్ రికవరీ చర్యలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. అలా హైకోర్టు తీర్పుతో డీఆర్‌ టీ ద్వారా బండ్ల గణేష్ కుటుంబానికి ఇప్పటికే లభించిన ఊరట కొనసాగలేదు. మరోవైపు, యూనియన్ బ్యాంక్ చేపట్టిన వేలం ప్రక్రియకు హైకోర్టు పూర్తి మద్దతు లభించింది. దీంతో ఆ ఆస్తి వేలం వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News