నేను తెలుగు వాడినే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న స్టార్ నటుడు!
తమిళ చిత్ర పరిశ్రమలో వందలాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటుడు శ్రీమన్ అందరికీ సుపరిచితుడే. అయితే, ఆయన మన పక్కా తెలుగువాడు అన్న విషయం చాలా మందికి తెలియదు.
తమిళ చిత్ర పరిశ్రమలో వందలాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటుడు శ్రీమన్ అందరికీ సుపరిచితుడే. అయితే, ఆయన మన పక్కా తెలుగువాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఎన్నో ఏళ్లుగా తమిళంలో బిజీగా ఉన్నా, తన మాతృభాష అయిన తెలుగులో సరైన గుర్తింపు రాలేదనే బాధ ఆయనను ఎప్పటినుంచో వేధిస్తోంది. తాజాగా ఒక వీడియో ద్వారా తన మనసులోని ఆవేదనను పంచుకుంటూ, తన కోరికను తీర్చిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి శ్రీమన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మాతృభాషలో రాని గుర్తింపు:
నటుడు శ్రీమన్ తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో జనాలు ఆయనను గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతుంటారు. కానీ, చివర్లో "మీ పేరేంటి?" అని అడిగినప్పుడు ఆయన మనసు ఎంతో గాయపడేదట. ఇక తమిళంలో వందల సినిమాలు చేసినా, సొంత భాష తెలుగులో తనకు ఇంకా సరైన గుర్తింపు రాలేదే అని ఆయన ఎప్పుడూ బాధపడేవారు.
తూర్పు గోదావరి జిల్లా అబ్బాయిని:
చాలా మంది శ్రీమన్‌ను తమిళ నటుడు అనుకుంటారు, కానీ ఆయన తాను పక్కా తెలుగువాడినని గర్వంగా చెప్పుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మామిడాడ గ్రామానికి చెందినవారు. "నేను తెలుగువాడిని, నాకు చక్కగా తెలుగు మాట్లాడటం వచ్చు... సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి" అని ఎంతో మంది టాలీవుడ్ దర్శకులను అడగాలనిపించినా, మొహమాటం కొద్దీ అడగలేకపోయానని శ్రీమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనిల్ రావిపూడి తీర్చిన కోరిక:
శ్రీమన్ ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న ఆ ఒక్క అవకాశాన్ని 'హిట్ డైరెక్టర్' అనిల్ రావిపూడి ఇచ్చారు. హైదరాబాద్‌లో విజయ్ 'వారిసు' షూటింగ్ జరుగుతున్న సమయంలో నిర్మాత దిల్ రాజు ద్వారా అనిల్ రావిపూడితో శ్రీమన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పుడే ధైర్యం చేసి శ్రీమన్ తనకు ఒక్క అవకాశం ఇవ్వమని అడిగారు. అనిల్ రావిపూడి కూడా శ్రీమన్ నటనపై ఉన్న గౌరవంతో తన కొత్త సినిమాలో ఒక అద్భుతమైన పాత్రను ఇచ్చారు.
తెలుగు సినిమా కోసం తమిళ చిత్రాల త్యాగం:
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో శ్రీమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా తమిళంలో ఒప్పుకున్న నాలుగు సినిమాలను వదిలేసుకున్నారట. అక్కడ తన స్నేహితులైన దర్శకులు కూడా శ్రీమన్ మాతృభాషలో నటిస్తున్నందుకు సంతోషంగా సపోర్ట్ చేశారని, ఇప్పటికే వారం రోజులు షూటింగ్‌లో పాల్గొన్నానని ఆయన సంతోషంగా చెప్పారు.
తెలుగులో డైలాగులు చెప్పి రెండు మూడేళ్లు అవుతోందని, ఇప్పుడు మళ్లీ సొంత భాషలో నటిస్తుంటే వచ్చే ఆనందమే వేరని శ్రీమన్ ఎమోషనల్ అయ్యారు. "అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు" అనే సామెతను గుర్తుచేస్తూ, అనిల్ రావిపూడి సినిమాతో తెలుగులో తనకున్న పెద్ద వెలితి తీరిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాతో శ్రీమన్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు రావాలని, మరిన్ని అవకాశాలు దక్కాలని మనమూ కోరుకుందాం..