ఇసకపట్నం సిరీస్.. టాప్ 3లో ట్రెండింగ్..
లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో ఇసకపట్నం సిరీస్ కూడా నిలిచింది. స్టార్ క్యాస్టింగ్ సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ తెలుగు వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్-3 ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఓటీటీల్లో కొత్త కంటెంట్ కు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే కొన్ని వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ లోకి చేరుతుంటే, లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో ఇసకపట్నం సిరీస్ కూడా నిలిచింది. స్టార్ క్యాస్టింగ్ సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ తెలుగు వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్-3 ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఆ వెబ్ సిరీస్ ను తామాడా మీడియా ప్రొడక్షన్స్ గ్రాండ్ గా నిర్మించింది. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఆ సిరీస్ జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ తో పాటు సుధాకర్ కోమాకుల, సునీల్, నరేశ్ అగస్త్య, రాజీవ్ కనకాల, బెనర్జీ, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇసకపట్నం అనే తీరప్రాంతం చుట్టూ వెబ్ సిరీస్ కథ సాగుతుంది. మత్స్యకారుల జీవితాలపై ఆధిపత్యం చెలాయించే నాయకుల మధ్య జరిగే పోరాటం కథలో మెయిన్ ఎలిమెంట్. చిన్నారావు అనే స్థానిక నాయకుడి వద్ద సాధారణ వ్యక్తిగా చేరిన నాయుడు, తర్వాత పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుని ఆ ప్రాంతానికి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు. అధికారం కోసం అతను వేసే అడుగులు కథలో కీలక మలుపులకు కారణమవుతాయి.
నాయుడు కుమార్తె భారతి మాత్రం తండ్రి ఆలోచనలకు భిన్నంగా సమాజ సేవను తన లక్ష్యంగా ఎంచుకుంటుంది. ప్రజల కోసం పనిచేస్తూనే తన వ్యక్తిగత జీవితంలో కూడా పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. మరోవైపు నాయుడికి వ్యతిరేకంగా పోతన, ప్రతాప్ వర్మ కలిసి వ్యూహాలు రచించడం, నాయుడు తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకునే నిర్ణయాలు కథను ముందుకు నడిపిస్తాయి.
అదే సమయంలో ఆటో డ్రైవర్ పెద్దన్న రాజకీయాల్లోకి రావాలనే ఆశతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నాయుడి అనుచరులు, ప్రత్యర్థులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే పరిణామాలు కథలో కీలకంగా మారతాయి. భారతి జీవితంలో చోటుచేసుకునే మలుపులు, ప్రతాప్ వర్మతో ఆమె మ్యారేజ్, ఆ తర్వాత జరిగే సంఘటనలు కూడా కథలో ప్రధాన భాగంగా ఉంటాయి. చివరకు ఇసకపట్నంపై నాయుడు ఎలా పట్టు సాధించాడు? ఆ ప్రాంతంలో అతని ఆధిపత్యానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
ఇన్స్పెక్టర్ వర్మ మాఫియాను అడ్డుకునేందుకు ఏం చేశాడు? భారతి తన తండ్రిని ఎందుకు వ్యతిరేకించింది? పెద్దన్న రాజకీయ ఆశయం నెరవేరిందా? కోటయ్య హత్య వెనుక కారణం ఏమిటి? చివరకు ఇసకపట్నంలో ఆధిపత్యం ఎవరి చేతికి వెళ్లింది? వంటి ప్రశ్నలకు సమాధానమే ఇసకపట్నం వెబ్ సిరీస్. జూలై 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఆ వెబ్ సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు టాప్ 3 ట్రెండింగ్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.