అలిపిరిలో జై బాలయ్య.. అఖండ 2 కోసం ఇలా..

తిరుపతిలో బాలయ్య అభిమానులు చేసిన హడావిడి చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తోంది.;

Update: 2025-12-09 07:29 GMT

నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అందులోనూ 'అఖండ' లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ వస్తుందంటే ఆ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని రోజులుగా రిలీజ్ విషయంలో జరిగిన గందరగోళం, వాయిదా వార్తలతో ఫ్యాన్స్ కొంచెం డీలా పడ్డారు. కానీ ఇప్పుడు సినిమాకు ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతున్నట్లు సంకేతాలు అందుతుండడంతో వారు మళ్ళీ ఫుల్ జోష్ లోకి వచ్చేశారు.

తిరుపతిలో బాలయ్య అభిమానులు చేసిన హడావిడి చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తోంది. సినిమా విడుదల ఖరారు కావడంతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి అలిపిరి దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ హీరో సినిమాకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదని వెంకన్నను వేడుకున్నారు.

కేవలం దండం పెట్టుకుని ఊరుకోలేదు, అలిపిరి మెట్ల దగ్గర ఏకంగా 101 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఒకపక్క కొబ్బరికాయలు కొడుతూనే, మరోపక్క "జై బాలయ్య" అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది. అఖండ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఇలాగే పూజలు చేశారని, ఇప్పుడు సీక్వెల్ కు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అక్కడి ఫ్యాన్స్ చెబుతున్నారు.

నిజానికి గత రెండు రోజులుగా లీగల్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిపోతుందేమో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వారిని కన్ఫ్యూజ్ చేశాయి. కానీ సమస్య సజావుగా పరిష్కారం అవ్వడం, రిలీజ్ కు లైన్ క్లియర్ అవుతుండడంతో వాళ్లు ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. ఆ ఆనందంలోనే ఇలా భారీ ఎత్తున తరలివచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

అఖండ 2 ఘనవిజయం సాధించాలని, బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. మొదటి పార్ట్ కంటే ఇది ఇంకా పెద్ద రేంజ్ లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్పూర హారతులు ఇచ్చారు. దేవుడి దయ, మా హీరో స్టామినా కలిస్తే రిజల్ట్ అదిరిపోతుందని వారు ధీమాగా ఉన్నారు.

మొత్తానికి సినిమాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది, ఫ్యాన్స్ పూజలు కూడా గ్రాండ్ గా పూర్తయ్యాయి. ఇక థియేటర్లలో శివ తాండవం చూడటమే మిగిలింది. తిరుపతి నుంచి మొదలైన ఈ పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు పాకేస్తున్నాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.



Tags:    

Similar News