బాలయ్యకు ఎందుకింత పొగరు? క్విక్ ఆన్సర్ ఇదిగో!
`అఖండ 2: తాండవం` బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధిస్తోంది. పెయిడ్ ప్రీమియర్లు, మొదటి రోజు కలెక్షన్లు కలిపి రూ. 59 కోట్ల గ్రాస్‌ను అధిగమించగా, రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టిందని తెలిసింది. బుక్‌మైషోలో టికెట్ బుకింగ్ లు బలంగా ఉన్నందున, ఆదివారం కలెక్షన్లు రెండవ రోజు కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒకానొక సమయంలో గంటకు 15000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఎన్బీకే అఖండ 2 కు తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది.
అఖండ సక్సెస్ వేదికపై నటసింహా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... ``చరిత్రలో చాలా మంది ఉంటారు. కానీ చరిత్ర సృష్టించేది, తిరగరాసేది ఒక్కరే. ఏం చూసి బాలయ్యకు ఇంత పొగరు అంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు. నా వ్యక్తిత్వమే ఉసిగొలిపే విప్లవం`` అంటూ ఎన్బీకే ఎమోషనల్ గా మాట్లాడారు.
అఖండ 2 కి సమీక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అయినా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ భక్తిరస యాక్షన్ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్ తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించారు. ఈ పాన్-ఇండియన్ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మించింది.
ఎన్బీకే ఇటీవలి కాలంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తన నటనతో హృదయాలను గెలుచుకుంటున్నాడు. అఖండ 2లో అఘోరా పాత్రతో అతడు స్పెషల్ ట్రీటిచ్చాడు. ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్ హృదయాలను గెలుచుకుంటున్నాయి. నిజానికి అఖండ 2 హిందూత్వ ఎజెండా సినిమా అంటూ కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో హిందువుల గురించి మాత్రమే కాదు.. భారతదేశ ఐక్యత, సమగ్రత గురించి చర్చించారు దర్శకుడు.