కథలు వింటున్నా ఓకే అవని ప్రాజెక్టులు.. మోక్షజ్ఞ మైండ్‌లో ఏముంది?
ఇండస్ట్రీలో ఇది సాధారణ ఆలస్యం కాదని, ప్లానింగ్ లోపం లేదా నిర్ణయాల విషయంలో గందరగోళం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.;
నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాల్సిన మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అనేది గత కొన్నేళ్లుగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ డెబ్యూ చుట్టూ ఉన్న అంచనాలు ఎంత పెరుగుతున్నాయో, అదే స్థాయిలో అనిశ్చితి కూడా పెరుగుతోంది. ముఖ్యంగా టాప్ డైరెక్టర్లు వరుసగా ప్రయత్నాలు చేసినా ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి వెళ్లకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఇది సాధారణ ఆలస్యం కాదని, ప్లానింగ్ లోపం లేదా నిర్ణయాల విషయంలో గందరగోళం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.
మోక్షు కోసం లైన్ లో స్టార్ డైరెక్టర్లు
ఇప్పటికే ప్రశాంత్ వర్మ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ చివరి నిమిషంలో ఆగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. అదే విధంగా క్రిష్ జాగర్లమూడి, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా మోక్షజ్ఞతో సినిమా చేయాలనే ఆసక్తి చూపించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి చెప్పిన కథకు కూడా మోక్షు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇక ఈ డెబ్యూ వెనుక అసలు ప్లాన్ ఏమిటి అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని కొందరు చెబుతుంటే, మరోవైపు ఓవర్ థింకింగ్ వల్లే నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎలాంటి కథతో, ఎలాంటి డైరెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వాలనే విషయంలో స్పష్టత లేకపోవడం ఈ పరిస్థితికి కారణమై ఉంటుందని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో ముఖ్యమైన కోణం స్టార్ కిడ్ ప్రెజర్. నందమూరి ఫ్యామిలీ లెగసీకి తగినట్టుగా ఎంట్రీ ఇవ్వాలంటే భారీ అంచనాలను అందుకోవాల్సిందే. మోక్షజ్ఞ పై ఉన్న ఈ ఒత్తిడి కారణంగానే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకుంటున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఒక్క రాంగ్ స్టెప్ వేసినా అది కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలస్యం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పొచ్చు.
అయితే ఈ ఆలస్యం మరో సమస్యకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే కొత్త జనరేషన్ హీరోలు వరుసగా ఎంట్రీ ఇచ్చి మార్కెట్‌లో తమ స్థానం దక్కించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ ఎంట్రీ మరింత ఆలస్యం అయితే టైమింగ్ మిస్ అవుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అభిమానుల్లో ఉన్న హైప్ ఎంతకాలం కొనసాగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి, టాప్ డైరెక్టర్లు లైన్లో ఉన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ కాకపోవడం, ప్లానింగ్ పై సందేహాలు, స్టార్ కిడ్ ప్రెజర్ వల్ల మోక్షజ్ఞ డెబ్యూ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది అసలు ఈ ఎంట్రీకి క్లాప్ ఎప్పుడు పడుతుంది?