క్రిష్ తో బాలయ్య.. ఈ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్?
నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఆదిత్య 369 సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. అప్పట్లోనే ఈ సినిమాలో బాలయ్య సైన్స్ ఫిక్షన్ జానర్ ను టచ్ చేసారు.;
నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఆదిత్య 369 సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. అప్పట్లోనే ఈ సినిమాలో బాలయ్య సైన్స్ ఫిక్షన్ జానర్ ను టచ్ చేసారు. ఈ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ కూడా అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుండని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే దీని సీక్వెల్ కోసం బాలయ్య ఆసక్తిగా ఉన్నారని, ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.
అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో కీలక ముందడుగు పడినట్లైంది. కాగా, క్రిష్, బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. ఈ సినిమాతో క్రిష్ పనితనం ఎలా వుంటుందో బాలయ్యకు తెలుసు. అలాగే తాజాగా ఆయన తొలి భాగం తెరకెక్కించిన హరి హర వీరమల్లు సినిమా విడుదలైంది.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తొలి భాగం బాగుందని క్రిష్ వర్క్ ను మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య తన ప్రాజెక్ట్ ను కన్ ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా వుంటుందా లేదా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుందా అనేది మున్ముందు తెలుస్తుంది. కాగా, ఈ సినిమాను క్రిష్ సన్నిహితుడు రాజీవ్ రెడ్డి నిర్మిస్తారా? లేదా ఇతర బ్యానర్ కు అవకాశం ఇస్తారా? అనేది చర్చల్లో ఉంది.
ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇదివరకే కన్పార్మ్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.
గోపీచంద్ సినిమాతోనే క్రిష్ ప్రాజెక్ట్ కూడా ఒకేసారి సమాంతరంగా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మరోవైపు, డైరెక్టర్ క్రిష్ అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నారు. ఆఖరి దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 05న విడుదల అనే టాక్ వుంది. ఈ సినిమా కంప్లీట్ అయితే క్రిష్, బాలయ్య సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తారు.