రవితేజకు జరిగినట్లే బాలయ్యకు
పెద్ద బడ్జెట్లో సినిమాలకు శ్రీకారం చుట్టడం.. మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చి ఆగిపోవడం ఎప్పట్నుంచో చూస్తున్నాం.;
పెద్ద బడ్జెట్లో సినిమాలకు శ్రీకారం చుట్టడం.. మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చి ఆగిపోవడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. అలాగే ఒక సినిమాకు అన్నీ సిద్ధం చేసుకున్నాక.. బడ్జెట్ పరంగా వర్కవుట్ కాదేమో అని ముందే వెనక్కి తగ్గిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన గోపీచంద్ మలినేనికి ఇప్పటికే ఇలాంటి అనుభవం ఒకటి ఉంది. రవితేజతో ‘క్రాక్’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీశాక.. ఈ కలయికలో మరో సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేసింది కొన్నేళ్ల ముందు.
ఈ చిత్రానికి అనౌన్స్‌మెంట్ కూడా అయింది. కాస్ట్ అండ్ క్రూ కూడా కన్ఫమ్ అయింది. ఐతే ఇక షూట్ మొదలు అనుకుంటుండగా.. ఈ చిత్రానికి బ్రేక్ పడింది. అప్పుడే డిజిటల్ రైట్స్ మార్కెట్ తగ్గుముఖం పడుతుండడంతో.. అనుకున్న బడ్జెట్లో సినిమా తీసి వర్కవుట్ చేయడం కష్టమని భావించి ఈ సినిమాను ఆపేశారు. తర్వాత రవితేజ వేరే సినిమాకు వెళ్లిపోయాడు. గోపీచంద్ కొంచెం బ్రేక్ తీసుకుని.. ఆ తర్వాత ఇదే కథను బాలీవుడ్లో సన్నీ డియోల్‌తో చేశాడు. ఆ చిత్రమే.. జాట్. ఆ సినిమాకు ఓ మోస్తరు ఫలితమే వచ్చింది.
కట్ చేస్తే గోపీచంద్.. బాలయ్యతో చేయాల్సిన రెండో సినిమాకు కూడా ఇలాగే బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక చారిత్రక కథతో తమ రెండో సినిమా చేయాలనుకున్నారు. ‘అఖండ-2’ రిలీజ్‌కు ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేయాల్సింది. అందులో ఒకటి రాజు పాత్ర. కానీ ‘అఖండ-2’కు వచ్చిన ఫలితం చూశాక, వేరే కారణాల వల్ల ముందు అనుకున్న కథను వర్కవుట్ చేయడం కష్టమని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ మరింతగా దెబ్బ తినగా. నిర్మాతలు ఆశిస్తున్న రేట్లకు దగ్గర్లోకి కూడా ఓటీటీ సంస్థలు రావట్లేదు. ‘అఖండ-2’తో జాక్ పాట్ కొట్టామనుకున్న నిర్మాతలు చివరికి.. రిలీజ్ డేట్ మారడం, సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడకపోవడం వల్ల నష్టాల పాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బాలయ్య కొత్త సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించి ముందు అనుకున్న భారీ కథను పక్కన పెట్టి.. కొత్తగా ఒక మాస్ మసాలా కథ మీద పని చేస్తున్నారట. ఈ కథ ఓకే అయ్యాక సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.