రెట్టించిన ఉత్సాహంతో న‌ట‌సింహం బ‌రిలోకి!

గాయం నుంచి కోలుకున్న నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ షూటింగ్ బరిలోకి దిగారు.

Update: 2026-10-07 22:30 GMT

గాయం నుంచి కోలుకున్న నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ షూటింగ్ బరిలోకి దిగారు. ఇటీవల చేతికి గాయం కావడం .. శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు ఆయన విశ్రాంతి తీసుకుని సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య కోలుకోవడంతో ఆయన అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఎంతో ఉపశమనం పొందింది. తాజాగా పూర్తి ఆరోగ్యంతో సరికొత్త శక్తితో ఆయన తాజా క్రేజీ ప్రాజెక్ట్ `దాదా` షూటింగ్‌లో అడుగుపెట్టడంతో సెట్స్‌లో సందడి నెలకొంది.

దర్శకుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నూతన షెడ్యూల్ తాజాగా కర్ణాటకలోని మైసూర్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. గాయం కారణంగా నిలిచిపోయిన ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ నేరుగా పాల్గొనడంతో చిత్ర బృందం పనులను మరింత వేగవంతం చేసింది. మైసూర్‌లోని ప్రముఖ రాజభవనాలు, చారిత్రక ప్రదేశాల నేపథ్యంలో బాలయ్యపై కొన్ని కీలకమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ డ్రామా మేళవించి దర్శకుడు గోపీ ఈ కథను తీర్చిదిద్దుతున్నారు. బాలయ్య శైలికి సరిపోయే పవర్‌ఫుల్ డైలాగ్స్, హై-వోల్టేజ్ ఫైట్ సీన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైసూర్ షెడ్యూల్‌లో బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన నటీనటులు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

గాయం నుంచి కోలుకున్న వెంటనే ఎలాంటి విరామం లేకుండా మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొనడం బాలకృష్ణ డెడికేషన్‌కు అద్దం పడుతోంది. నటన పట్ల ఆయనకున్న అంకితభావం చూసి యూనిట్ సభ్యులు, కో-స్టార్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూనే, సెట్స్‌లో బాలయ్య చూపించే ఉత్సాహం చిత్ర యూనిట్ లో నూతన ఉత్తేజాన్ని నింపిందని ద‌ర్శ‌క‌,నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, చిన్న గ్లింప్స్‌కు నందమూరి అభిమానుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమా డిసెంబ‌ర్ లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో పోటా పోటీగా రిలీజ్ అవ్వ‌డం కంటే ? సులువైన తేదీల్లోనే రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News