2025 రికార్డు పవన్‌దా, బాలయ్యదా?
ఐతే కెరీర్ చివరి దశలో ‘ఓజీ’తో అభిమానులను మురిపించాడు పవన్. ఈ సినిమా ఫ్యాన్ మూమెంట్స్, ఎలివేషన్లతో అభిమానులను ఉర్రూతలూగించడమే కాక.. కలెక్షన్ల పరంగా వారు తలెత్తుకునేలా చేసింది.;
ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల వేటలో ముందుండేవాడు పవన్ కళ్యాణ్. ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు వసూళ్ల మోత మోగించాయి. చివరగా 2013లో ‘అత్తారింటికి దారేది’తో అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును పవన్ బద్దలు కొట్టాడు. ఐతే తర్వాత ఆయనకు సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. రాజకీయాల్లో బిజీ అయి మొక్కుబడిగా సినిమాలు చేశాడు. అదే సమయంలో ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది.
మిగతా ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి తర్వాతి తరం హీరోలు ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించారు. ఇప్పుడు పవన్ రికార్డుల్లో పోటీ పడే స్థాయిలో లేడన్నది వాస్తవం. ఆయన సినిమాలకే పరిమితమై, తన పొటెన్షియాలిటీకి తగ్గట్లుగా సినిమాలు చేస్తూ ఉంటే వేరే విషయం. కానీ పవన్ ఆ స్థితిలో లేడు. అసలు పవన్ ఇకపై సినిమాలు చేయడమే కష్టంగా కనిపిస్తోంది.
ఐతే కెరీర్ చివరి దశలో ‘ఓజీ’తో అభిమానులను మురిపించాడు పవన్. ఈ సినిమా ఫ్యాన్ మూమెంట్స్, ఎలివేషన్లతో అభిమానులను ఉర్రూతలూగించడమే కాక.. కలెక్షన్ల పరంగా వారు తలెత్తుకునేలా చేసింది. పవన్ కెరీర్లో ఇదే తొలి రూ.100 కోట్ల షేర్ మూవీ కావడం విశేషం. ఆల్రెడీ రూ.150 కోట్ల షేర్ మార్కును కూడా దాటేసింది. గ్రాస్ వసూళ్లలో పవన్ తొలిసారి రూ.300 క్లబ్బును కూడా అందుకున్నాడు. ప్రస్తుతానికి ఈ ఏడాదికి ‘ఓజీ’నే ఇండస్ట్రీ హిట్. సంక్రాంతికి వెంకీ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.300 కోట్లతో నెలకొల్పిన రికార్డును ‘ఓజీ’ బద్దలు కొట్టింది. కాబట్టి పవన్ ఓవరాల్ రికార్డులను బద్దలు కొట్టకపోయినా.. 2025కి హైయెస్ట్ గ్రాసర్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
కానీ ఈ రికార్డు పవన్ పేరిటే ఉంటుందా లేదా అన్నది బాలయ్య చేతుల్లో ఉంది. ఆయన కొత్త సినిమా ‘అఖండ-2’ డిసెంబరు 5న రిలీజ్ కానుంది. ఈ ఏడాది మిగిలిన రెండున్నర నెలల్లో రాబోయే ఏకైకా భారీ చిత్రం అదే. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్థాయిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి, పాన్ ఇండియా స్థాయిలోనూ ప్రభావం చూపిస్తే ‘ఓజీ’ కలెక్షన్లను అధిగమించే అవకాశముంది. బాలయ్య 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును చేజిక్కంచుకుంటాడు. లేదంటే అది పవన్ పేరిటే ఉంటుంది.