బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంగతేంటి?
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా ఒక్క సినిమా తర్వాత మరో మూవీతో సందడి చేస్తున్నారు. నటించాలనే కోరిక ఉన్నప్పుడు ఏజ్ తో ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ చేసిన వారిలో బాలయ్య కూడా ఒకరనే చెప్పాలి.
అఖండ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య.. ఆ తర్వాత వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు అఖండ-2లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ తో పాటు బోయపాటి శ్రీనుతో నాలుగోసారి బాలయ్య వర్క్ చేస్తుండడంతో ఆడియన్స్, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే హైప్ క్రియేట్ చేస్తోంది.
అఖండ-2 మూవీతో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అఖండ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. నార్త్ లో బాలయ్యకు పెరుగుతున్న ప్రజాదరణ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో అలరిస్తుందనే హోప్స్ తో ఉన్నారు.
నందమూరి ఫ్యాన్స్ కూడా అదే ఆశాభావంతో ఉన్నారు. కానీ రిలీజ్ డేట్ పైనే అనుమానపడుతున్నారు. ఎందుకంటే రిలీజ్ కు మరో 40 రోజులే ఉన్నా మేకర్స్ ఒక్క సాంగ్ కూడా విడుదల చేయలేదు. పోస్ట్ పోన్ అంటూ రూమర్స్ వస్తున్నా స్పందించడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
యాక్షన్ సీక్వెన్స్ ల్లో విజువల్ ఎఫెక్ట్స్ కీలకం. అందుకే బోయపాటి శ్రీను వ్యక్తిగతంగా యాక్షన్ డిజైన్ ను పర్యవేక్షిస్తున్నారని టాక్. ప్రతి సన్నివేశానికి వివరణాత్మక శ్రద్ధ అవసరమనే చెప్పాలి. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు టైమ్ పట్టేలా కనిపిస్తుంది. అదే నిజమైతే రిలీజ్ డేట్ లో మార్పు తప్పదు. మరి బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.