రిలీజైన చాన్నాళ్లకు వివాదం దిశగా బాలీవుడ్ సిరీస్
ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ రిలీజై చాలా రోజులవుతుంది. రిలీజై చాలా కాలమైనప్పటికీ ఆ సిరీస్ డిస్కషన్స్ కు దారితీస్తూనే ఉంది.;
ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ రిలీజై చాలా రోజులవుతుంది. రిలీజై చాలా కాలమైనప్పటికీ ఆ సిరీస్ డిస్కషన్స్ కు దారితీస్తూనే ఉంది. రీసెంట్ గా ఆడియన్స్ అందులో ఓ వివాదాస్పద ఉప కథను గమనించారు. ధనవంతుడైన షౌమిక్, సిరీస్ మొత్తం తన పనిమనిషి పుష్పతో అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత ఆమెను లవ్ చేయడం, బాలీవుడ్ లో జరిగిన షైనీ అహుజా కేసును గుర్తు చేస్తుంది.
రియల్ లైఫ్ సంఘటనను గుర్తొచ్చేలా..
భూల్ భూలాయా, మెట్రో అండ్ వో లామ్‌హే సినిమాలతో ఫేమస్ అయిన అతను తన ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో షౌమిక్ ప్రవర్తన ఆడియన్స్ కు ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌నే గుర్తు చేస్తుంది. ఇంటి కార్మికులపై లైంగిక వేధింపులు అనగానే అందరికీ షైనీ అహుజా సంఘటనే గుర్తొస్తుంది.
మీర్జాపూర్ నుంచి నో ఎంట్రీ వరకు..
బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ లో పనిమనిషి తో షౌమిక్ లవ్ ట్రాక్ చూశాక అందరికీ కొన్ని ప్రశ్నలను మదిలో మెదులుతున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఇప్పటికీ పని మనిషిని ఎందుకు ఒక వస్తువులానే చూపిస్తుందనే ప్రశ్నతో పాటూ, పురుషుని కోరికలకు పని మనిషే ఎందుకు టార్గెట్ అవుతుందనే లాంటి ప్రశ్నలను సంధిస్తోంది. మీర్జాపూర్ మూవీ నుంచి నో ఎంట్రీ సినిమాల వరకు ప్రతీ దాంట్లో బాలీవుడ్ లో పని మనిషిని ఇలానే చూపిస్తూ వస్తున్నారు.
మీర్జాపూర్ లో మున్నా భాయ్ కు పని మనిషితో ఉన్న రిలేషన్ ను చాలా ఓపెన్ గా చూపించగా, నో ఎంట్రీలో ఆ పాత్రను కామెడీ కోసం వాడారు. ఇదంతా తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలను లైంగికంగా లోబరుచుకోవడం అనే లోతైన సమస్యను తెలుపుతుంది. పని మనుషులు చాలా మంది ఆర్థికంగా బలహీన కుటుంబాల నుంచే వస్తారు. బలహీన కుటుంబాల నుంచి రావడంతో వాళ్లు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారని మీడియా చూపించడం కరెక్ట్ కాదు. అలా చూపించడం వల్ల స్త్రీ ద్వేషపూరిత ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. వాటి వల్ల వ్యవస్థాగత అసమానత లైంగిక ఫాంటసీగా మారుతుంది. ఇలాంటి సీన్స్ ను పదే పదే వాడటం వల్ల బాలీవుడ్ స్త్రీ ద్వేషం నుంచి బయటపడటానికి ఇష్టపడటం లేదనే అందరికీ అనిపిస్తుంది. ఇప్పటికైనా మేకర్స్ ఇలాంటి సీన్స్ ను తగ్గించడం బెటర్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.