అలాంటి స్క్రిప్టు వ‌స్తే మెగాస్టార్ ఇప్పుడు న‌టిస్తారా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ర‌జ‌నీకాంత్ `బాషా` సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2026-09-26 02:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ర‌జ‌నీకాంత్ `బాషా` సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవిస్తూ, తన గతాన్ని రహస్యంగా ఉంచే అండర్‌వరల్డ్ డాన్ `మాణిక్యం` పాత్రలో రజినీకాంత్ చూపించిన అభినయం ఆ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. అయితే ఈ అద్భుతమైన కథ ముందుగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలనే ప్ర‌య‌త్నం చేసారనే విషయం చాలామందికి తెలియ‌క‌పోవ‌చ్చు. 1994లో `బిగ్ బాస్` మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు సురేష్ కృష్ణ చిరంజీవికి ఈ కథ వినిపించడం.. నిర్మాత అల్లు అరవింద్‌తో చర్చలు జరగడం జరిగిపోయినా.. కేవలం రూ. 15 లక్షల బడ్జెట్ తేడా వల్ల ఆ రీమేక్ హక్కులు చేజారిపోయాయి.

`బాషా` సినిమా కథాంశం విషయానికి వస్తే.. శాంత స్వభావుడైన ఒక సాధారణ వ్యక్తి లోపల ఒక భయంకరమైన- పవర్‌ఫుల్ డాన్ దాగి ఉండటం..తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మళ్లీ ఆయుధాలు పట్టడం అనే కోణంలో సాగుతుంది. ఈ కథ పూర్తి స్థాయి మాస్ ఎలివేషన్లతో.. ఎమోషనల్ డ్రామాతో రజినీకాంత్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా సురేష్ కృష్ణ మ‌లిచారు. తెరపై రజినీకాంత్ చూపించిన బాడీ లాంగ్వేజ్, స్టైల్, మ్యానరిజమ్స్ .. ఆటో డ్రైవర్‌గా సాదాసీదా లుక్‌లో కనిపిస్తూనే పవర్‌ఫుల్ యాక్షన్‌కు దిగే తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ పాత్రకు రజినీకాంత్ మాత్రమే నూటికి నూరుపాట్లు న్యాయం చేయగలరని.. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు ఆ టెంప్లేట్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పవచ్చు.

అయితే ఒక అగ్ర హీరో చేయాల్సిన కథను వేరొకరితో చేయించాలనే ఆలోచన అప్పట్లో కొంత చర్చకు దారితీసినా, రజినీకాంత్ స్వయంగా చిరంజీవి అయితేనే ఈ పాత్ర బాగుంటుందని భావించడం విశేషం. కానీ అప్పట్లో చిరంజీవి ఇతర భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. ఒకవేళ చిరంజీవి గనుక ఈ పాత్ర చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనేది నేటికీ అభిమానులకు ఓ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు కూడా ఈ కథ సరిగ్గా సరిపోయేదే అయినా రజినీకాంత్ చేసిన ఆ పర్టిక్యులర్ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఆ సినిమాను హిస్టారికల్ హిట్ చేసింది.

చిరంజీవి కెరీర్ పరంగా పరిశీలిస్తే.. ఆయన ఆరంభంలో గూండా, గ్యాంగ్ లీడర్.. ఇటీవ‌లి గాడ్ ఫాద‌ర్ వంటి ఎన్నో మాస్ హిట్స్.. డాన్ క‌థాంశాల త‌ర‌హా యాక్షన్ చిత్రాల్లో నటించారు. కానీ ఒక సాధారణ ఆటో డ్రైవర్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపించే `బాషా` లాంటి పవర్ పుల్ - డ్యుయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మాత్రం చిరు కెరీర్‌లో రాలేదని చెప్పాలి. చిరు సినిమాలు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్, హై-వోల్టేజ్ యాక్షన్, మాస్ డ్యాన్స్‌ల చుట్టూ తిరిగేవి. `బాషా`లో కనిపించే ఆ సైలెంట్ ఇంటెన్సిటీ.. ఒక్కసారిగా ఎగసిపడే డాన్ ఎలివేషన్స్ లాంటి పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ ట్రాక్ చిరు చిత్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది.

మరి భవిష్యత్తులో ఇలాంటి `బాషా` తరహా పాత్రలో మెగాస్టార్ నటిస్తారా అంటే.. ప్రస్తుతం ఆయన తన వయసుకు తగినట్లుగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడున్న ట్రెండ్‌లో ఒకవేళ అలాంటి పవర్‌ఫుల్- ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా లేదా మాస్ క్యారెక్టర్ పడితే మెగాస్టార్ తన పరిణతి చెందిన నటనతో మరో లెవల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులు కోరుకునే ఆ పాత మాస్ మేనియాని మళ్లీ తెరపైకి తెచ్చే సత్తా కేవలం చిరంజీవికి మాత్రమే ఉంది.

Tags:    

Similar News