'బాహుబలి ది ఎపిక్' 4K ట్రైలర్ విజువల్ ట్రీట్
భారతీయ సినిమా దశ దిశ మార్చిన ఫ్రాంఛైజీగా `బాహుబలి`కి ప్రత్యేక గుర్తింపు ఉంది. బాహుబలి -1, బాహుబలి -2 చిత్రాలు సంచలన వసూళ్లతో రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే.;
భారతీయ సినిమా దశ దిశ మార్చిన ఫ్రాంఛైజీగా `బాహుబలి`కి ప్రత్యేక గుర్తింపు ఉంది. బాహుబలి -1, బాహుబలి -2 చిత్రాలు సంచలన వసూళ్లతో రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే కట్టప్ప వెన్నుపోటు ప్రశ్నతో మొదటి భాగాన్ని ముగించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రెండో భాగంపై బోలెడంత క్యూరియాసిటీని పెంచగలిగాడు. దాని ఫలితంగా పార్ట్ 2 ఏకంగా 1400కోట్లు పైగా నికర వసూళ్లను వసూళ్లను సాధించింది.
అయితే బాహుబలి కథలను విభజించిన తీరు కొందరు అభిమానులకు నచ్చలేదు. ఒకే కథగా ఈ సినిమాని చూస్తే బావుంటుందని చాలా మంది మేధావులు కూడా భావించారు. అయితే ఇప్పుడు అలాంటి వారందరి కోరికను నెరవేరుస్తూ ఆర్కా మీడియా సంస్థ బాహుబలి1 , బాహుబలి 2 చిత్రాలను ఒకే సినిమాగా ఎడిట్ చేసి బాహుబలి - ది ఎపిక్ పేరుతో విడుదల చేస్తోంది. దీనిని 4కేలో రీమాస్టర్ చేసిన వెర్షన్ లో అత్యంత నాణ్యతతో రెడీ చేసి రిలీజ్ కి సిద్ధం చేసారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం `బాహుబలి- ది ఎపిక్` విడుదలవుతోంది.
ఇప్పటికే పోస్టర్లు అభిమానుల్లో వైరల్ అయ్యాయి. సూర్యవంశపు రాజు బాహుబలి, అతడి సోదరుడైన భళ్లాల దేవుడి మధ్య ఆధిపత్య పోరును ఆవిష్కరిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం వీరాధివీరుల విరోచిత పోరాటాలు రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి వర్సెస్ భళ్లాల దేవ పోరాట సన్నివేశాలు హైలైట్ గా కనిపిస్తున్నాయి. శివగామి (రమ్యకృష్ణ) భళ్లాలదేవు(రానా)డిని మాహిష్మతి సింహాసనంపై పట్టాభిషిక్తుడిని చేయాలని భావించాక, వరుస పరిణామాలు ఏమిటన్నది తెరపై వీక్షించాల్సిందే. కట్టప్ప వెన్నుపోటు డైలాగ్‌తో పని లేకుండా ఈసారి మొత్తం సినిమాని ఒకటిగా చూసే వీలుంది. దేవసేన కోసం అమరేంద్ర బాహుబలి ఏ రూపంలో తిరిగి వచ్చాడు? అన్నది తెరపైనే చూడాలి.
బాహుబలి రణరంగంలో దిగితే ఎదురేలేని వాడిగా శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. భళ్లాల దేవుడి బంధిఖానాలో ఉన్న దేవసేనను విడిపించే క్రమంలో అతడి ఉద్విగ్న ప్రయాణం రక్తి కట్టిస్తోంది. వరసగా భారీ వారియర్ సన్నివేశాలతో కొన్ని అద్భుతమైన సింగిల్ లైన్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించారు. ముఖ్యంగా 4కే విజువల్స్, సౌండ్ క్వాలిటీ ఈసారి అద్భుతంగా కుదిరాయి. మునుపటితో పోలిస్తే రీరికార్డింగ్ మరింత ఎనర్జిటిక్ గా రక్తి కట్టిస్తోంది. బాహుబలి- ది ఎపిక్ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.