బాహుబలి: ది ఎపిక్: ఊహించని రేంజ్ లో టీజర్ మ్యాజిక్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు భాగాల సినిమాలు.. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి;
భారత సినిమా చరిత్రలోనే గర్వకారణంగా నిలిచిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు భాగాల సినిమాలు.. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా వంటి తారాగణం నటించిన ఈ సినిమాలు కలెక్షన్లలో ఎన్నో రికార్డులు సృష్టించాయి.
వరల్డ్ వైడ్ గా రెండు వేల కోట్ల మార్క్ ను టచ్ చేసిన మొదటి సినిమాగా ఆల్ టైమ్ బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ అద్భుత అనుభవాన్ని మరోసారి కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ఆసక్తికరమైన ప్లాన్ చేశారు. ఈ రెండు భాగాలను మళ్లీ రీ-కట్ చేసి, ఒకే సినిమాగా రూపొందించారు. దానికి బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్ ఖరారు చేశారు. గణేష్ చతుర్థి కానుకగా ఈ స్పెషల్ వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ విషయానికి వస్తే.. కొత్తగా ఏ సీన్లు లేదా సీక్వెన్స్‌లు జోడించకపోయినా, మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌ను హైలైట్ చేస్తూ కట్ చేశారు. దాంతో చూసిన వెంటనే సినిమా చూడాలని అనిపించేలా ఆ మ్యాజిక్ ను మళ్లీ గుర్తు చేశారు. ఇప్పటికే అనేక సార్లు థియేటర్స్, టీవీ, ఓటీటీలలో చూసినా, ఈసారి ఐమాక్స్, 4డీఎక్స్, డీ-బాక్స్, ఎపిక్ ఫార్మాట్లలో భారీ స్థాయిలో థియేట్రికల్ అనుభవాన్ని ఇవ్వబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు.
అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అవనుంది. ప్రత్యేకించి డాల్బీ సినిమాస్ టెక్నికల్ సపోర్ట్‌తో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని రీతిలో బాహుబలిని ఫీల్ అయ్యే అవకాశం రాబోతోంది. సినిమా స్టార్ కాస్ట్‌లో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, సత్యరాజ్, నాసర్, రమ్యకృష్ణ, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
వీరి అద్భుతమైన నటన, రాజమౌళి విజన్ కలిసినప్పుడు ఆ మంత్రం ఎప్పటికీ మరువలేనిది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఒకే సారి, కాంపాక్ట్‌గా, ఇంకా గ్రాండ్‌గా మళ్లీ ఆస్వాదించమని మేకర్స్ ప్రేక్షకులను ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి బాహుబలి: ది ఎపిక్ అనేది కేవలం రీ రిలీజ్ కాదు.. అది ఒక కొత్త థియేట్రికల్ జర్నీ అని చెబుతున్నారు. ఈసారి టెక్నికల్ అప్‌గ్రేడ్స్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమా, మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.