హృతిక్ 'బాహుబలి' ఎప్పుడూ కాడు..!
బాహుబలి సినిమా వచ్చి పదేళ్లు దాటినా ఇంకా ఆ సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. సినిమా రెండు పార్ట్‌లను కలిపి ఒక్క పార్ట్‌గా భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.;
బాహుబలి సినిమా వచ్చి పదేళ్లు దాటినా ఇంకా ఆ సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. సినిమా రెండు పార్ట్‌లను కలిపి ఒక్క పార్ట్‌గా భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను రెగ్యులర్ సినిమాల మాదిరిగా ప్రమోట్ చేయబోతున్నారు. రాజమౌళితో పబ్లిసిటీ చేయించడంతో పాటు, అవసరం అయితే ప్రభాస్‌ను సైతం రంగంలోకి దించేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలు తమ వైపు నుంచి ప్రచారం మొదలు పెట్టారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ సినిమాను చూసేందుకు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌లు కామన్ అయ్యాయి. అయితే అన్ని రీ రిలీజ్‌ల మాదిరిగా కాకుండా ఈ సినిమా చాలా స్పెషల్‌గా, రెగ్యులర్ డైరెక్ట్ రిలీజ్ అన్నట్లుగానే విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మహేష్ బాబుతో రూపొందుతున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ చకచక జరుగుతోంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో రాజమౌళి బాహుబలి ది ఎపిక్ సినిమా కోసం టైం కేటాయించడం మాత్రమే కాకుండా ఎడిటింగ్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా నిర్మాతల నుంచి సమాచారం అందుతోంది. బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ కాకుండా హృతిక్ రోషన్ నిజమేనా?
ఇక బాహుబలి విడుదలైనప్పటి నుంచి మొదట ఈ సినిమాకు ప్రభాస్‌ను కాకుండా హృతిక్ రోషన్‌ను హీరోగా రాజమౌళి అనుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రభాస్ కంటే హృతిక్ రోషన్ ఇంకా ఎక్కువ న్యాయం చేసి ఉండేవాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో అంటూ వచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా కథను రాజమౌళి హృతిక్ రోషన్ వద్దకు తీసుకు వెళ్లలేదు. కనీసం సినిమా గురించి రాజమౌళి ఎప్పుడూ కూడా హృతిక్ తో మాట్లాడిందే లేదట. ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి నిర్మాతలు తెలియజేశారు. బాహుబలి ది ఎపిక్ విడుదల సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. బాహుబలిగా ఎప్పుడూ హృతిక్ రోషన్‌ను అనుకోలేదు అంటూ నిర్మాతలు బల్లగుద్ది మరీ చెప్పడంతో ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.
బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమే...
బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమే... ఆయన తప్ప బాహుబలిగా మరెవ్వరూ సరిపోరు, బాహుబలిగా ఆయన్ను తప్ప మరెవ్వరినీ అనుకోలేదు అంటూ నిర్మాతలు చెప్పుకొచ్చారు. బాహుబలి పాత్రకు ప్రభాస్ తప్ప మరెవ్వరితోనూ కనీసం చర్చలు కూడా జరగలేదు. ప్రభాస్‌ను బాహుబలిగా అనుకున్న తర్వాతే సినిమా పనులు మొదలు అయ్యాయి. అంతకు ముందు కూడా మరే హీరో ఆలోచన లేదని అన్నారు. రాజమౌళి కూడా కథ రెడీ చేసే సమయంలో ప్రభాస్ కోసమే అన్నట్లుగా చేయడం జరిగింది. ప్రభాస్ కాకుండా బాహుబలికి అంతగా ప్రాణం పెట్టి మరెవ్వరూ న్యాయం చేసే వారు కాదు అన్నట్టుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు. బాహుబలిపై ఉన్న అంచనాల నేపథ్యంలో అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నారు. రికార్డ్ స్థాయిలో వందల కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలి ఇప్పుడు మళ్లీ ఆ వందల కోట్ల నెంబర్స్‌ను టచ్ చేస్తాయా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.